హైదరాబాద్, జనవరి16 (నమస్తే తెలంగాణ): జలవివాదాల పరిష్కారం కోసం కేంద్రం ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీ ఈ నెల 30న తొలిసారి భేటీ కానున్నది. ఈ మేరకు కమిటీ మెంబర్ సెక్రటరీ, సీడబ్ల్యూపీ సీఈ రాకేశ్‌కుమార్ తాజాగా తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు లేఖలు రాశారు. న్యూఢిల్లీ సేవాభవన్‌లోని సీడబ్ల్యూసీ కార్యాలయంలో 30న మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం జరుగుతుందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ భేటీలో నీటి నిర్వహణపై వివాదాస్పద, పరిష్కరించాల్సిన కీలక అంశాలను తక్షణమే సమర్పించాలని ఇరు రాష్ర్టాలకు సూచించారు. ఆయా అంశాలపై చర్చించేందుకు అవసరమైన సమాచారాన్ని అందించాలని గోదావరి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులను ఆదేశించారు.
కమిటీకి సాంకేతిక సహాయం కోసం సీడబ్ల్యూసీ (ఇరిగేషన్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్) సీఈ, హైడ్రాలాజికల్ స్టడీ ఆర్గనైజేషన్ (హెచ్‌ఎస్‌వో) సీఈలను కూడా నియమించుకునే అంశంపై కూడా చర్చించనున్నట్టు వెల్లడించారు. రాష్ర్టాలు, కమిటీ సభ్యులు పూర్తిస్థాయిలో సమావేశానికి సిద్ధం కావాలని కమిటీ మెంబర్ సెక్రటరీ తాను పంపిన లేఖలో ఆదేశించారు. తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య జలవివాదాల పరిష్కారానికి 15 మంది అధికారులతో కేంద్రం ప్రత్యేక నిపుణుల కమిటీని ఇప్పటికే ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ అనుపమ్ ప్రసాద్ నేతృత్వం వహించనున్నారు. వీరిలో తెలంగాణ, ఏపీ నుంచి నలుగురు చొప్పున సభ్యులుగా ఉన్నారు. ఇరు రాష్ర్టాలకు సంబంధించి జలవివాదాలు, నీటి నిర్వహణ, పంపకాలపై మూడు నెలల్లోగా సమగ్రమైన నివేదికను సమర్పించాలని కమిటీకి కేంద్ర జల్‌శక్తి శాఖ సూచించింది. అందులో భాగంగా 30న తొలిసారి ఈ కమిటీ భేటీ కానున్నది.
తెలంగాణ సర్కార్ అత్యుత్సాహం
పొరుగు రాష్ట్రం చేపడుతున్న నల్లమలసాగర్‌ను బేషరతుగా వ్యతిరేకించకుండా తెలంగాణ ప్రభుత్వం చర్చలకు ఉత్సాహం చూపడం, కమిటీకి అంగీకరించి రావడంపై ఇప్పటికే తెలంగాణ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతున్నది. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ నుంచి, సాగునీటిరంగ నిపుణులు, తెలంగాణవాదుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఏపీ పేర్లను పంపిన వారంలోగానే రేవంత్ సర్కార్ సైతం గుట్టుగా కేంద్రానికి రాష్ట్ర అధికారుల పేర్లను ప్రతిపాదించింది. ఆ వెంటనే కేంద్ర జల్‌శక్తి శాఖ సైతం సత్వరమే కమిటీని ఏర్పాటు చేస్తూ, మూడు నెలల్లో నివేదికను ఇవ్వాలని ఆదేశించింది. దీనిపై తెలంగాణవాదులు తీవ్ర అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ జలహక్కులను ఏపీకి తాకట్టు పెట్టడమేనని అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. అదీగాక కేంద్ర జల్‌శక్తి శాఖ నియమించిన కమిటీలో తెలంగాణ అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం నుంచి అధికారులకు చోటు కల్పించకపోవడం చర్చనీయాంశంగా మారింది. నదీ జలాలకు సంబంధించి వివాదాలు, ట్రిబ్యునల్ అవార్డులు, నిబంధనలు, పొరుగు రాష్ర్టాలతో ఉన్న ఒప్పందాలు, ప్రాజెక్టులు తదితర అంశాలను అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం ఆధ్వర్యంలోనే కొనసాగుతాయి. కోర్టు పిటిషన్లు, ట్రిబ్యునల్ వాదనలపై ఆ విభాగం అధికారులే కీలకంగా వ్యవహరిస్తారు. తాజాగా వేసిన కమిటీ తెలంగాణ అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం అధికారులకు చోటు కల్పించకపోవడంపై రాష్ట్ర సర్కారు స్పందించకపోవడం గమనార్హం. కమిటీ భేటీ కోసం ఎజెండా అంశాలను సైతం తెలంగాణ సర్కారు సిద్ధం చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తున్నది.