Harish Rao : రేవంత్‌రెడ్డి సర్కారు దళితులకు అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. ఎస్సీ కార్పోరేషన్‌కు నిధులు కేటాయించి, వాటిని వినియోగంచడం లేదని విమర్శించారు. ఆ నిధులు కాగితాలకే పరిమితమయ్యాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో పేద పిల్లల విదేశీ విద్య కోసం అంబేద్కర్ ఓవర్సీస్ పథకాన్ని పెట్టిందని, ఒక్కో విద్యార్థికి రూ.20 లక్షల చొప్పున ఇచ్చి విదేశాలకు పంపిందని గుర్తుచేశారు. రేవంత్ సర్కారు ఆ పథకాన్ని కూడా నిలిపేసిందని ఆరోపించారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇవాళ సిద్ధిపేట జిల్లా తడకపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి, నివాళులు అర్పించిన అనంతరం హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు. తడకపల్లి గ్రామస్తుల దశాబ్దాల కల నెరవేరిందని ఆయన అన్నారు. గ్రామంలో అన్ని విధాలుగా అభివృద్ధి జరిగినా.. అంబేద్కర్ విగ్రహం లేదు అనే ఒక లోటు ఉండేదని, ఇవాళ ఆ మహనీయుడు విగ్రహావిష్కరణతో ఆ లోటు తీరిపోయిందని చెప్పారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు కృషి చేసిన తడకపల్లి ఉపసర్పంచ్ బైండ్ల సాయిని, ఆయన కుమారుడు నరేందర్‌ను తాను అభినందిస్తున్నానని అన్నారు.
అదేవిధంగా భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఫరిడవిల్లుతున్నదంటే అందుకు కారణం అందుకు అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ స్ఫూర్తే కారణమని హరీష్‌రావు చెప్పారు. కొందరు అంబేద్కర్ అంటే దళితులకు సంబధించిన వారు అనే భావనలో ఉంటారని, కానీ ఆయన అందరివాడని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లోని అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన కృషి చేశారని చెప్పారు. అంబేద్కర్ విగ్రహాలు పెట్టడం మాత్రమే కాదని, ఆయన ఆశయాలను కూడా అనురించాలని, అప్పుడు ఆయనకు మనం నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని అన్నారు.
ఎస్సీ ఎస్టీలు ఈరోజుల్లో రాజకీయాల్లో, ఉద్యోగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారంటే అది అంబేద్కర్ పెట్టిన భిక్ష అని అన్నారు. ‘బోధించు.. సమీకరించు.. పోరాడు’ అన్న అంబేద్కర్ విధానాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని హరీష్‌రావు సూచించారు. అంబేద్కర్ ఆలోచనలను ప్రజలకు బోధిస్తూ.. జనాన్ని సమీకరించాలని, ఆపై హక్కుల కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. రేవంత్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చి మాట తప్పిందని మండిపడ్డారు. కనీసం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు.
అదేవిధంగా యువత అంబేద్కర్ ఆలోచన విధానాలను అలవర్చుకోవాలని హరీష్ రావు కోరారు. అంబేద్కర్ మార్గంలో వెళ్తే భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పారు. అలా కాకుండా డ్రగ్స్, ఆన్లైన్ గేమ్స్‌కు అలవాటు పడితే జీవితం నాశనమవుతుందని హెచ్చరించారు. డ్రగ్స్‌కు, ఆన్లైన్ గేమ్స్‌కు బానిసలుగా మారి తల్లిదండ్రులను అప్పులపాలు చేయవద్దని కోరారు.