కొల్లాపూర్, జనవరి 9 : నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం వాసులు మంత్రి జూపల్లి కృష్ణారావును నిలదీశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తే.. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ నిధులను ఎందు కు రద్దు చేసిందని ప్రశ్నించారు. శుక్రవారం సింగోటం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సమీక్షకు హాజరైన మంత్రిని స్థానికులు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు.
సింగోటం ఆలయాభివృద్ధికి నిధులు కేటాయించడంలేదని సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాసులు, మాజీ ఉప సర్పంచ్ సత్యనారాయణ, ఉపసర్పంచ్ సాయికృష్ణగౌడ్తోపాటు పలువురు ఆరోపించారు. నాటి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి హయాంలో ఆలయాభివృద్ధికి రూ.15 కోట్లు కేటాయిస్తే ఎందుకు రద్దు చేశారని నిలదీశారు. దీంతో మంత్రి జూపల్లి తీవ్ర ఆగ్రహంతో వారిపై ఊగిపోయారు.