కామారెడ్డి, డిసెంబర్ 13: తమను బెదిరించి సోమ్లా నాయక్ తండా సర్పంచ్ అభ్యర్థిని ఏకగ్రీవం చేశారని ఆరోపిస్తూ కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని పంతులు తండా వాసులు శనివారం కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. అనంతరం జిల్లా ఎన్నికల నోడల్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పంతులు తండావాసులు మాట్లాడుతూ.. సోమ్లా నాయక్ తండా పంచాయతీ పరిధిలో సోమ్లా నాయక్ తండాతోపాటు పంతులు నాయక్ తండా ఉన్నట్టు తెలిపారు. సోమ్లా నాయక్ తండాలో మూడు వార్డులు ఉండగా 200 పైచిలుకు ఓటర్లు, పంతులు నాయక్ తండాలో మూడు వార్డులు, 166 మంది ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు.
సోమ్లా నాయక్ తండా పంచాయతీగా ఏర్పడిన సమయంలో ఒకసారి సోమ్లా నాయక్ తండాకు, మరొకసారి పంతులు నాయక్ తండాకు సర్పంచ్ పదవి ఇవ్వాలని అప్పట్లోనే నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఆ మేరకు గతంలో సోమ్లా నాయక్ తండా వారికి అవకాశం రాగా, ఈ సారి తమకు ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు.
అయితే తమ తండా నుంచి సర్పంచ్ అభ్యర్థిగా లలిత గోప్యా మొదటి విడతలో నామినేషన్ వేయగా తమ వద్ద ఓటర్లు తక్కువగా ఉన్నారని, నామినేషన్ వేసినా గెలువనివ్వబోమని సర్పంచ్ అభ్యర్థిని బెదిరించి విత్ డ్రా చేయించారని ఆరోపించారు. సోమ్లా నాయక్ తండాకు చెందిన హరితాసంతోష్ను ఏకగ్రీవం చేశారని తెలిపారు. ఏకగ్రీవాన్ని రద్దు చేసి ఎన్నికలు నిర్వహించాలని వారు కోరారు.