హైదరాబాద్, జనవరి13 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటిరోజు నుంచే ప్రజా సమస్యలను గాలికొదిలి, పాలనను పక్కనబెట్టి చెడగొట్టడమే పనిగా పెట్టుకున్నారు. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపివేయాలనే పంతం తో తెలంగాణను విధ్వంసం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిరావడంతోనే గోదావరి జలాలతో కోటి ఎకరాల మాగాణకు నీళ్లు అందించే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను పనిగట్టుకుని ఎండబెట్టారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ను పడావుపెట్టారు. ఇప్పుడు జిల్లాల పునర్విభజన మీద పడ్డారు. అయితే, జిల్లాల పునర్విభజనకు కేంద్ర ప్రభుత్వం నుంచి సాంకేతిక అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉన్నది. దేశవ్యాప్తంగా చేపట్టనున్న జన గణన ప్రక్రియ ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.
2027 మార్చి 1 నుంచి దేశవ్యాప్తంగా జనాభా గణన మొదలుకానున్నది. ఈ ప్రక్రియ జరిగే సమయంలో జిల్లాల సరిహద్దుల్లో మార్పులు చేస్తే, జనాభా లెకల సేకరణలో గందరగోళం ఏర్పడుతుందని, శాస్త్రీయంగా గణాంకాలను నమోదుచేయడం కష్టమవుతుందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ భావిస్తున్నది. జనాభా గణన పూర్తయ్యే వరకు రాష్ట్రాల్లోని పరిపాలనా విభాగాల సరిహద్దులను మార్చవద్దని కేంద్రం గతంలోనే మార్గదర్శకాలు జారీ చేసింది. అంతేకాదు, కొత్త జనాభాలెకల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరుగబోతున్నది. అసెంబ్లీ సీట్లు పెరుగబోతున్నాయి. దార్శనికత ఉన్న నాయకత్వమైతే ఈ మార్పులు, చేర్పులను పరిగణనలోకి తీసుకోవాలి. జనాభా లెక్కలు, నియోజకవర్గాల స్వరూపం తేలిన తర్వాత దానికి అనుగుణంగా జిల్లాల స్వరూపం శాస్త్రీయంగా నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. కానీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించకుండా హడావుడి చేస్తుండటం విస్మయం కలిగిస్తున్నది.
రెండేండ్ల పాలన విఫలమై తీవ్ర ప్రజావ్యతిరేకత పెరిగిన నేపథ్యంలో ఓవైపు ప్రజల దృష్టిని మరల్చడంతోపాటు మరోవైపు జిల్లాల్లో కాంగ్రెస్ నేతల ప్రాబల్యం పెంచేందుకు జిల్లాల పునర్విభజనను తెరమీదికి తెచ్చినట్టు అనుమానిస్తున్నారు. సరిహద్దుల సవరణలతో అమల్లోకి తీసుకువచ్చే జిల్లాలకు కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లు పెట్టుకోవాలని భావిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి మామ, కాంగ్రెస్ నాయకుడు సూదిని జైపాల్‌రెడ్డి పేరు పెట్టడానికే ఫ్యూచర్ సిటీ మండలాల చుట్టూ ఉజ్జాయింపుగా సరిహద్దు గీతలు గీసి జిల్లాగా ఉనికిలోకి తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. జనగామ జిల్లాను పూర్తిగా రద్దుచేసి, సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్, కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్‌ను కలిపి ఒక జిల్లా చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు సమాచారం. ఈ జిల్లాకు పీవీ నరసింహారావు పేరు పెట్టాలనే ఆలోచన చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పీవీ నరసింహారావును పూర్తిగా విస్మరించిన సంగతి తెలిసిందే.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పీవీ నరసింహారావు గొప్పతనాన్ని గుర్తించారు. ఆయన జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. పీవీ కూతురు వాణీదేవికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి గౌరవించారు. పీవీ కుటుంబానికి కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ ప్రాధాన్యత ఇస్తున్నదని అప్పట్లో కాంగ్రెస్ వర్గాల్లోనే చర్చ జరిగింది. ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఇప్పుడు జిల్లాకు పీవీ నరసింహారావు పేరు పెట్టాలని ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. కేవలం ఒక సంఖ్యను ప్రామాణికంగా తీసుకొని జిల్లాలను మార్చాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిద్దిపేట, సిరిసిల్ల, సూర్యాపేట, గద్వాల, వనపర్తి, జనగామ, హనుమకొండ, ములుగు జిల్లాల రద్దు ప్రతిపాదన రాజకీయంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి ‘సెల్ఫ్ గోల్’ కానున్నదనే టాక్ వినిపిస్తున్నది. భౌగోళిక స్వరూపం మారిస్తే ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని విశ్లేషకులు చెప్తున్నారు.