హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ సమస్యలపై కార్మిక సంఘాల నాయకులతో చర్చల సందర్భంగా ఒప్పుకొన్న అంశాలను మాత్రమే ప్రభుత్వం అమలు చేయాలని భావిస్తున్నట్టు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ తెలిపారు. ప్రభుత్వంలో విలీనం, అపాయింటెడ్ డే, ఇతర సమస్యల పరిష్కారం వంటి అంశాలపై కార్మిక జేఏసీ నేతలు శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలువగా.. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కార్మిక జేఏసీ నేతలు ఆర్టీసీ విలీనంపై పట్టుబట్టడంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి.. ఆయన ఆదేశాల మేరకు తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
దీంతో కార్మిక సంఘాల జేఏసీ నేతలు ఆశిస్తున్నట్టు అపాయింటెడ్ డే జూన్ 2న ఉండబోదని స్పష్టంగా అర్థమవుతున్నది. 2021 వేతన సవరణ వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు మంత్రి చెప్పారు. మంత్రిని కలిసిన తర్వాత జేఏసీ నేతలు మళ్లీ అత్యవసర సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రిని కలిసి విలీన ప్రక్రియ చేపట్టాలని, మాస్టర్ సేల్ అమలు చేయాలని వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు.