అయిజ, జూన్ 30 : కర్ణాటకలోని ఆర్డీఎస్ (రాజోళి బండ డైవర్షన్ స్కీమ్) ఆనకట్ట డెడ్‌స్టోరేజీకి చేరుకున్నది. ఎగువన వర్షాలు కురవక పోవడంతో ఆర్డీఎస్కు ఇన్‌ఫ్లో లేక ఆర్డీఎస్లో నీరు రోజురోజుకూ అడుగంటిపోతున్నది. దీంతో జోగుళాంబ గద్వాల జిల్లా పరిధిలోని ఆర్డీఎస్ ప్రధాన కాలువకు నీటి ప్రవాహం నిలిచింది. ఎగువన ఉన్న తుంగ, భద్ర జలాశయాల నుంచి తుంగభద్ర ప్రాజెక్టుకు నీటి చేరిక మొదలు కాకపోవడంతో తుంగభద్ర ప్రాజెక్టు అడుగంటింది. దీంతో ఈ ఏడాది ఆర్డీఎస్ ఆయకట్టు వానకాలం పంటల సాగు ప్రశ్నార్థకంగా మారుతున్నదని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
సూపర్ ఎల్ నినో ప్రభావం దక్షిణ తెలంగాణపై పడుతుండటంతోపాటు కర్ణాటక, ఏపీ రాష్ర్టాలు తుంగభద్ర నదిపై అక్రమంగా చేపట్టిన ఎత్తిపోతల పథకాల కారణంగా వచ్చిన నీటిని వచ్చినట్టే తోడేస్తుండటంతో ఆర్డీఎస్కు ఇన్‌ఫ్లో రావడం లేదని రైతులు వాపోతున్నారు. జూలై చివరిలోగా ఆరీఎస్ ఆనకట్ట ద్వారా నీటిని విడుదల చేస్తే నారుమళ్లు పెంచుకొనేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.