Tekmal |టేక్మాల్: టేక్మాల్ మండలం బోడ్మట్పల్లిలో వరి వ్యవసాయ క్షేత్రం వద్ద రైతులకు ఎల్ నినో ప్రభావంపై మండల వ్యవసాయాధికారి రాంప్రసాద్ అవగాహన కల్పించారు.
వరి సాగును తగ్గించి ప్రత్యామ్నాయ పంటలైన పెసర, మినుము, కంది, జొన్న పంటలను సాగుచేయాలని అన్నారు. రైతుల ఆరోగ్యం బాగుండాలన్నా, భూసారం తగ్గకుండా ఉండాలంటే యూరియా వాడకాన్ని పూర్తిగా తగ్గించాలని కోరారు. నానో యూరియా నానో డీఏపీలను వాడుతూ పంటలను సాగు చేయాలని సూచించారు.
మండలంలో జొన్నల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయించామని రైతులు జొన్న పంటను అధికంగా సాగు చేయాలని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులు సాగు చేస్తున్న వడ్లను ఆన్లైన్ తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ కాని పంట నమోదు వివరాలను విధిగా నమోదు చేసుకోవాలన్నారు. పంటల సాగుపై వ్యవసాయాధికారుల సలహా సూచనలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏఈవో మహేశ్, రైతులు పాల్గొన్నారు.