Abhaya Hastham | నమస్తే తెలంగాణ నెట్వర్క్, డిసెంబర్ 30: అభయహస్తం దరఖాస్తుల స్వీకరణకు నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా గందరగోళంగా కొనసాగుతున్నది. శనివారం కూడా చాలాచోట్ల దరఖాస్తు ఫారా లు అందక జనం ఇబ్బందులు పడ్డారు. సరిపడా కౌంటర్లు పెట్టకపోవడంతో జనానికి తిప్పలు తప్పలేదు. సంగారెడ్డి జిల్లా గుమ్మిడిదలలో జనం భారీ సంఖ్యలో రావడంతో పో లీసులు గ్రామపంచాయతీ కార్యాలయ గేటు మూసేసి ఒక్కొక్కరిని లోపలికి పంపించారు. కొంత మందికి దరఖాస్తులు అందలేదు. మం గళవారం ఇస్తామని చెప్పడంతో ప్రజలు ఆ గ్రహం వ్యక్తంచేశారు. రైతుబంధు ఇంతవరకు ఇవ్వలేదని, గ్యాస్ సబ్సిడీ, మహిళలకు రూ.2,500 ఇవ్వడానికి వారివద్ద అకౌంట్ నంబర్లు లేవా? అందరి ఆధార్, రేషన్ కార్డు నంబర్లు ఉన్నాయి కదా? అని సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలోని వెంకటాపూర్‌కు చెందిన రైతు నాగేంద్రప్ప ప్రశ్నించాడు.
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కల్లపల్లి-బేలూర్ గ్రామ పంచాయతీ కార్యాలయానికి ప్రజలు శనివారం రాగా, కార్యాలయానికి తా ళం వేసి ఉండటంతో నిరాశతో వెనుదిగారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని నార్లపూర్‌లో ప్రజాపాలన కార్యక్రమంలో జడ్పీటీసీ పంజా విజయ్‌కుమార్ పాల్గొని ప్రభుత్వ తీరును ఎండగట్టారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం దామరచెర్వు, రాయిలాపూర్, కాట్రియాల, దంతేపల్లి గ్రామాల్లో అధికారులు సందేహాలను తీర్చకపోవడంతో ప్రజలు అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రేటర్ వరంగల్ 39వ డివిజన్ అండర్ రైల్వేగేట్ ప్రాంతంలోని జన్మభూమి జంక్షన్లో ఏ ర్పాటుచేసిన ఓ సెంటర్‌కు వృద్ధుడు యూరిన్ పైపుతో వచ్చిన ఫొటో శనివారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామసభలో ప్రజలిచ్చిన దరఖాస్తు ఫా రాలను అధికారులు కాకుండా ఆశ వర్కర్లు, హెల్త్ అసిస్టెంట్లు, అంగన్వాడీ కార్యకర్తలు, సమభావన సంఘం లీడర్లు తీసుకొని, రసీదులపై కూడా వారే సంతకాలు పెట్టారు. దరఖాస్తు ఫారంలో రేషన్ కార్డు ఆప్షన్ లేకపోవడంపై ప్రజలు అధికారులను నిలదీశారు. దీంతో రూ.10 ఇస్తే జిరాక్స్ షాపు వాళ్లు ఇస్తారంటూ అధికారులు సమాధానం ఇవ్వడంతో ప్రజలు విస్మయం వ్యక్తం చేశారు. అదే జిల్లాలోని నిడమనూరులో దరఖాస్తు ఫారాలు స గం మందికి అందకపోవటంతో జిరాక్స్ షా పులు, ఇంటర్నెట్ సెంటర్లను ఆశ్రయించాల్సి వచ్చింది. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారంలో కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ మహిళా ఎంపీపీ పిల్లి రేణుక మాట్లాడుతుండగా అడ్డుకొని దుర్బాషలాడారు.
ప్రజా పాలన కార్యక్రమం మూడో రోజు విజయవంతంగా నిర్వహించినట్టు సీఎస్ శాం తికుమారి తెలిపారు. మూడు రోజుల్లో మొత్తం 40,57,592 దరఖాస్తులు అందాయని చెప్పారు. శనివారం 1,991 గ్రామాలు, 1,877 మున్సిపల్ వార్డుల్లో మొత్తం 18,29,107 దరఖాస్తులు స్వీకరించామని వెల్లడించారు.