Regional Ring Road | హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) ప్రాజెక్టు పురోగతి అగమ్యగోచరంగా మారింది. ఉత్తర భాగం పనులకు టెండర్లు ఆహ్వానించి 6 నెలలు కావస్తున్నా ఇంతవరకు ఏజెన్సీని ఖరా రు చేయలేదు. ప్లాన్‌ను 4 లేన్ల నుంచి 6 లేన్లకు మార్చడంతో రీటెండర్ అనివార్యమైందని, దానికి కేంద్ర క్యాబినెట్ అనుమతి లభించిన తర్వాతే ఏజెన్సీని ఖరారు చేసి, పనులు చేపట్టేందుకు వీలవుతుందని అధికారులు చెప్తున్నారు. ట్రిపుల్ఆర్కు వెంటనే క్లియరెన్స్ ఇవ్వాలని సీఎం సహా సంబంధిత మంత్రి ఇప్పటికే పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తిచేసినా ఫలితం రాలేదు. ట్రిపుల్ఆర్ ఉత్తరభాగం పనులకు నిరుడు డిసెంబర్ 27న జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఆన్లైన్ పద్ధతిలో టెండర్లను ఆహ్వానించి, ఈ ఏడాది ఫిబ్రవరి 14 వరకు గడువు ఇచ్చారు. ఆ పనులను 5 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచారు. రూ.7,104.06 కోట్లతో 161.5 కిలోమీటర్ల మేర నాలుగు లేన్లతో నిర్మించాల్సిన యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేను 6 లేన్లతో నిర్మించాలని ఇటీవల నిర్ణయించారు. సంబంధిత ఏజెన్సీ టెండర్లను ఫిబ్రవరి 17న తెరవా ల్సి ఉన్నది. వాటిని తెరవకపోగా ఏజెన్సీని ఖరారుచేసే గడువును సైతం పొడిగిస్తూ వస్తున్నారు.
ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా 6 లేన్లతో నిర్మించాలని ఇటీవల నిర్ణయించడంతో వ్యయాన్ని సవరించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా 8 లేన్లకు అవసరమైన భూసేకరణ చేస్తున్నందున ఇందులో మార్పేమీ లేదని, నిర్మాణ వ్యయాన్ని మాత్రం సవరించాల్సి ఉన్నదని అధికారులు చెప్తున్నారు. కేంద్రం మాత్రం రాష్ట్ర ప్రతినిధులు కలిసిన ప్రతిసారీ త్వరలోనే అన్నిరకాల క్లియరెన్స్‌లు ఇస్తామని చెప్తున్నది. కానీ అమలుకు నోచుకోవడం లేదు. దీంతో ట్రిపుల్ఆర్ వ్యవహారం సందిగ్ధంలో పడింది.
సంగారెడ్డి జిల్లాలోని గిర్మాపూర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా తంగడపల్లి వరకు 161.518 కి.మీ. మేర ట్రిపుల్ఆర్ ఉత్తర భాగాన్ని నిర్మించేందుకు 1,950 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉన్నది. ఇందులో 95 శాతం వరకు భూసేకరణ పూర్తయినట్టు ప్రభుత్వం చెప్తున్నప్పటికీ సిద్దిపేట, యాదాద్రి, రాయగిరి తదితర ప్రాంతాల్లో భూసేకరణకు వ్యతిరేకంగా పలువురు రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కోర్టు స్టే ఇచ్చింది. భూసేకరణ ప్రక్రియ ‘ఒక అడుగు ముందుకి, రెండడుగులు వెనక్కి’ అనే చందంగా కొనసాగుతున్నది. 1950 హెక్టార్ల భూసేకరణకు చెల్లించాల్సిన రూ.5,100 కోట్ల నష్టపరిహారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించాల్సి ఉన్నది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద రూ.2,550 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. ఈ ఏడాది బడ్జెట్లో రూ.1,250 కోట్లు ప్రతిపాదించింది.