Woman Professors | హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ) : మహిళా ప్రొఫెసర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడికల్ కాలేజీ మహిళా ప్రొఫెసర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజా పాలనలో మెడికల్ కాలేజీ మహిళా ప్రొఫెసర్ల మొర ఎవరూ ఆలకించడం లేదని వాపోయారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు రాగానే మాండేటరీ ట్రాన్స్ఫర్లు అంటూ ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీల ప్రొఫెసర్లను చెట్టుకు ఒకరిని పుట్టకు ఒకరిని ట్రాన్స్ఫర్ చేశారని తెలిపారు.
గత 4-11 సంవత్సరాలుగా మహబూబ్ నగర్, నిజామాబాద్, అదిలాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, జగిత్యాల, నల్గొండ మెడికల్ కాలేజీల్లో, ఒకే చోట పని చేస్తున్న ప్రొఫెసర్లను హెల్త్ సెక్రటరీ, ఆరోగ్య శాఖ మంత్రి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తమ భర్తలు మానసికంగా వేధిస్తున్నారని, ట్రాన్స్ఫర్లు లేని ఉద్యోగం ఏంటని అని అవహేళన చేస్తున్నారని వాపోయారు. మహిళా ప్రొఫెసర్లు ఉదయం పది గంటల నుండి రాత్రి 7:30 వరకు హెల్త్ సెక్రటరీ ఆఫీస్ ముందు నిలబడినా అపాయింట్ మెంట్ ఇవ్వలేదని పేర్కొన్నారు. మనం ప్రజా పాలనలో ఉన్నామా లేక తాలిబన్ల పాలనలో ఉన్నామా అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోగ్య శాఖ మంత్రికి విన్నవించినా ఫలితం లేదని తెలిపారు. మిగతా చాలా శాఖల్లో బదిలీలు అవసరం లేకపోవచ్చు, కానీ మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్లకు మాత్రం బదిలీలు అత్యవసరమన్నారు.