ఖమ్మం వ్యవసాయం/కాశీబుగ్గ, అక్టోబర్ 28: ఖమ్మం ఏఎంసీలో ఒక్కసారిగా పత్తి ధర తగ్గింది. సోమవారం 35వేల బస్తాలు వచ్చిన విషయాన్ని గమనించిన ఖరీదుదారులు కూడబలుక్కున్నారు. ఆన్లైన్ బిడ్డింగ్‌లో గరిష్ఠ ధర క్వింటాకు రూ.6,800 పలికింది. అయినప్పటికీ సిండికేట్‌గా మారిన ఖరీదుదారులు ఏకంగా క్వింటాకు రూ.300 తగ్గించి రూ.6500కు దిగువనే ఉంచి పంటను కొనుగోలు చేశారు. ప్రస్తుతం సీసీఐ ధర రూ.7,520గా ఉంది. కానీ ఖరీదుదారులు అమాంతంగా ధర తగ్గించారు. ‘ఇంత దారుణంగా ధర తగ్గిస్తారా?’ అని కొందరు రైతులు ప్రశ్నిస్తే.. ‘ఇష్టమైతే అమ్ముకో.. లేకపోతే ఇంటికి తీసుకపో..’ అంటూ బయ్యర్లు సమాధానమిచ్చారు. సీసీఐ అధికారులు కొర్రీలు పెడుతుండడం వల్లనే రైతులు ఖమ్మం ఏఎంసీకి భారీగా పంటను తెస్తున్నా రు. సోమవారం వరంగల్ ఎనుమాముల మార్కెట్లో 6800ధర పలికింది. దీంతో రైతులు మార్కెట్ అధికారులను నిలదీశారు. స్వల్ప ఉద్రిక్తతతో క్రయవిక్రయాలు కొద్ది సేపు నిలిచిపోయాయి. వెంటనే మార్కెట్ కార్యదర్శి పోలెపాక నిర్మల రంగంలోకి దిగి రైతులకు పత్తి ధరలు తగ్గడంపై వివరించారు. అంతర్జాతీయ మార్కెట్లో పత్తి గింజలు, కాటన్ బెయిల్స్‌కు ధరలు తగ్గడంతో ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధరలకే పత్తి కొనుగోలు చేయాల్సి వస్తుందని తెలిపారు.