హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో అందించే కోడిగుడ్ల ధరలపై విద్యాశాఖ నిర్ణయం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మార్కెట్ ధరలకు అనుగుణంగా ధరలు పెంచలేదని ఏజెన్సీలు మండిపడుతున్నాయి. మార్కెట్లో కోడిగుడ్ల ధర రూ.7గా ఉంటే విద్యాశాఖ మాత్రం రూ.5లుగా ఉన్న ధరను రూ.6కు మాత్రమే పెంచుతూ ఉత్తర్వులివ్వమేంటని ఏజెన్సీ ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికే కోడిగుడ్లకు తక్కువ ధర నిర్ణయించడం, బిల్లుల పెండింగ్‌తో చాలా బడుల్లో మధ్యాహ్న భోజన ఏజెన్సీలు కోడిగుడ్ల సరఫరా నిలిపివేశాయని ఏజెన్సీల ప్రతినిధులు చెప్తున్నారు. ఈ తరుణంలో మార్కెట్ ధరకు అనుగుణంగా రూ.7కు పెంచాల్సిన ధరను రూ.6లకే పరిమితం చేయడమేంటని నిలదీస్తున్నారు. విద్యార్థులకు కోడిగుడ్డు అందించడాన్ని కూడా ప్రభుత్వం భారంగా భావించడం ఆలోచించడం సరికాదని విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడమూ ప్రభుత్వానికి భారమేనా అని నిలదీస్తున్నారు.