Hyderabad | న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక ఫార్ములా-ఈ రేసింగ్‌కు విశ్వనగరం హైదరాబాద్ మరోమారు ఆతిథ్యమివ్వబోతున్నది. దేశంలో తొలిసారి పోటీలకు వేదికైన హైదరాబాద్‌లో మళ్లీ వచ్చే ఏడాది ఫార్ములా-ఈ కార్లు రయ్య్‌మ్రంటూ అభిమానులను అలరించబోతున్నాయి. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ ఆతిథ్యంపై వస్తున్న నిరాధార వార్తలకు ఎట్టకేలకు పుల్‌స్టాప్ పడింది. వచ్చే ఏడాది కూడా హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ పోటీలు జరుగుతాయని నిర్వహకులు గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వ తేదీన హైదరాబాద్ వేదికగా పార్ములా-ఈ 10వ ఏబీబీ ఎఫ్ఐఏ సీజన్ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు.
గురువారం సమావేశమైన ఎఫ్ఐఏ వరల్డ్ మోటార్ స్పోర్ట్ కౌన్సిల్..ఫార్ములా-ఈ 2024 వేదికలకు ఆమోదముద్ర వేసింది. దీంతో మరోమారు రేసింగ్ అభిమానులు రాష్ట్ర రాజధానిలో రయ్య్‌మ్రంటూ వెళ్లే కార్ల వేగాన్ని ఆస్వాదించే అవకాశం లభించింది. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఫార్ములా-ఈ రేసును ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించించింది. దేశంలో తొలిసారి జరిగిన ఈ పోటీలకు ఆతిథ్య హక్కులు దక్కే విషయంలో మంత్రి కేటీఆర్ అన్నీతానై వ్యవహరించారు. నిత్యం ఫార్ములా-ఈ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతూ హైదరాబాద్ వేదికగా జరగడంలో కీలక భూమిక పోషించారు. ఈ క్రమంలో ఫార్ములా-ఈ నిర్వాహకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. వాతావరణ కాలుష్యాన్ని నియంత్రిస్తూ ఎలక్ట్రిక్ కార్లతో రూపుదిద్దుకున్న ఫార్ములా-ఈ రేసింగ్‌కు ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన ఆదరణ లభిస్తున్నది.