CM breakfast | హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): సర్కారు బడుల్లో విద్యార్థుల ఆకలిని తీర్చేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం అమలుచేసిన సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసింది. విద్యార్థుల్లో రక్తహీనతను రూపుమాపడం, పోషకాహారాన్ని అందించడమే లక్ష్యంగా నాడు తెచ్చిన ఈ పథకానికి 8 నెలలుగా రాష్ట్ర సర్కా రు నిధులు విడుదల చేయకపోవడంతో దాని లక్ష్యం నీరుగారింది. దీంతో బీఆర్ఎస్ సహా విపక్షాల నుంచి తీవ్రమైన విమర్శలు రావడంతో అనివార్య పరిస్థితుల్లో ఈ పథకాన్ని మరో తీరుగా అమలుచేసేందుకు సిద్ధపడింది. ఈ పథకాన్ని దాతల సహకారంతో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ పథకం పేరు మార్చి కొత్త పథకంగా అమలుచేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నది.
సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్‌గా ఈ బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని మళ్లీ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత రాష్ట్రమంతటా ఈ పథకాన్ని విస్తరించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకానికి ఏటా రూ.700 కోట్లు ఖర్చు చేయాల్సి ఉన్నది. రేవంత్‌రెడ్డి సర్కారు ఆ నిధులివ్వలేక దాతలు, సీఎస్సార్ నిధుల వేటలో పడింది. వాస్తవానికి బ్రేక్ ఫాస్ట్ స్కీం పాతదే. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని సర్కారు నిలిపివేసింది. నయా పైసా విడుదుల చేయకుండా నిర్లక్ష్యంగా వ్యహరించింది.
రాష్ట్రంలో 2023 అక్టోబర్ 6న సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని అప్పటి మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి రంగారెడ్డి జిల్లాలోని రావిర్యాల పాఠశాలలో ప్రారంభించారు. 23 లక్షల విద్యార్థులకు లబ్ధిచేకూర్చేలా ఈ పథకాన్ని కేసీఆర్ సర్కారు రూపకల్పన చేసింది. వాస్తవంగా ఈ పథకం యావత్తు దేశానికే ఆదర్శమైంది. పీఎం పోషణ్ స్కీంలో భాగంగా బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని అమలుచేయాలని కేంద్రం భావిస్తున్నది.