మహబూబాబాద్ : రాజ్యాంగ రూపకర్త డా.బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా దేశంలో పేదలు అభివృద్ధి చెందడం లేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. దేశంలో పేదరిక నిర్మూలన జరుగాలంటే కేవలం సీఎం కేసీఆర్ తోనే సాధ్యమని అన్నారు. ఆదివారం పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూర్, పెద్దవంగర, పాలకుర్తిలో రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలను అందజేశారు. కేక్ కట్ చేసి, శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..దేశంలో మతాల పేరుతో బిజెపి రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధికోసం బిజెపి ఆరాటపడుతోందని ధ్వజమెత్తారు. గతంలో ఎన్నడూ ఏ పండుగను ప్రభుత్వాలు పట్టించుకోలేదు. తెలంగాణ వచ్చాక, సీఎం కేసీఆర్ అన్ని మతాలను గౌరవిస్తున్నారని మంత్రి తెలిపారు.
ప్రతి ఇంటికి పెద్ద అన్నలా బట్టలు పెడుతూ ఆదరిస్తున్నారని తెలిపారు. దేశంలో అన్ని మతాలను గౌరవించి, అయా మతాల పండుగలను ఘనంగా నిర్వహిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వమని స్పష్టం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 95 వేల మందికి బట్టలను క్రిస్మస్ కానుకగా ప్రభుత్వం అందజేస్తున్నారు. ఇందుకు 3 కోట్ల 90 లక్షలు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదని పేర్కొన్నారు. కరోనా నిబంధనలను అనుసరించి ఈ పండుగ జరుపుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.