Indiramma Illu | పట్టణ పేదల కోసం హైదరాబాద్‌లోని క్యూర్ ప్రాంతంలో లక్ష ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇస్తాం. క్యూర్ పరిధిలోని 19 నియోజకవర్గాల్లో మూడు విడతల్లో వీటిని నిర్మిస్తాం.
– రాష్ట్ర ప్రభుత్వం కొన్నాళ్లుగా చేస్తున్న ప్రచారం ఇది.
క్యూర్ పరిధిలో ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.11 లక్షల వరకు ఖర్చవుతున్నది. ఇందులో ప్రభుత్వం రూ.5 లక్షలు చెల్లిస్తుంది. మిగతా రూ.6 లక్షలు లబ్ధిదారుల నుంచి తీసుకుంటాం.
– మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సోమవారం చేసిన ప్రకటన ఇది.
హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ ఇండ్లపై ఆశలు పెట్టుకొన్న హైదరాబాద్ నగరవాసులకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. పట్టణ పేదలకు లక్ష ఇండ్లు నిర్మించి ఇస్తామంటూ రెండున్నరేండ్లుగా ఊదరగొడుతున్న ప్రభుత్వం ఉసూరుమనిపించింది. ‘నిర్మాణానికి భూములను గుర్తించాం, స్థల సేకరణ అయిపోయింది, అనుమతులు ఇచ్చేశాం, టెండర్లు పిలుస్తాం..’ అంటూ కొన్ని రోజులుగా ఊరించి, సోమవారం ఉసూరుమనిపించింది. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్)లోని మూడు కార్పొరేషన్ల పరిధిలో నిర్మించే ఇండ్లకు రూ.11 లక్షలు ఖర్చవుతున్నట్టు రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఇందులో ప్రభుత్వం రూ.5 లక్షలు ఇ స్తుందని, మిగతా ఖర్చు రూ.6 లక్షలను లబ్ధిదారులు చెల్లించుకోవాలని షరతు పెట్టింది. దీంతో ఇల్లు దక్కుతుందని ఆశ పెట్టుకున్న పేదలపై పిడుగు పడినట్టయింది. మొత్తంగా గుడిసెలు లేని రాష్ట్రమే లక్ష్యమంటూ ఊదరగొడుతూనే, లక్ష ఇండ్ల ద్వారా నిరుపేద లబ్ధిదారుల నుంచి సుమారు రూ.6 వేల కోట్లు వసూలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక వేసింది.
క్యూర్ పరిధిలో మంగళవారం నుంచి ఆగస్టు 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అయితే, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం నోటితో నవ్వి.. నొసటితో వెక్కిరించినట్టు ఉన్నదని లబ్ధిదారులు వాపోతున్నారు. ప్రభుత్వం పెట్టిన నిబంధనలను చూసి అవాక్కవుతున్నారు. దరఖాస్తుదారులు హైదరాబాద్‌లోని క్యూర్ పరిధిలో 10 ఏండ్లుగా నివాసం ఉంటేనే స్కీమ్ వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. దరఖాస్తుదారుని కుటుంబం క్యూర్ ఏరియాలో సొంత ఇల్లు, లేదా ఫ్లాట్ కలిగి ఉండొద్దని స్పష్టం చేసింది. ఏడాదికి ఆదాయం రూ.6 లక్షలకు మించొద్దని నిబంధన విధించింది.
అయితే, ఈ నిబంధనపైనే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారమే రూ.6 లక్షలలోపు ఆదాయం అంటే.. నెలకు రూ.50 వేల లోపు సంపాదన ఉండాలని, రాజధాని ప్రాంతంలో నివసించే కుటుంబాలకు ఈ వేతనం నుంచి మిగిలేది ఏమీ ఉండదని చెప్తున్నారు. ఎలాంటి మిగులు లేని వ్యక్తులు రూ.6 లక్షలు ఎలా చెల్లించగలుగుతారని ప్రశ్నిస్తున్నారు. ఈ మొత్తం ఆయా కుటుంబాలకు కొన్నేండ్ల సంపాదన అని విశ్లేషిస్తున్నారు.
ఈ లెక్కన ప్రభుత్వానికి రూ.6 లక్షలు చెల్లించాలంటే అప్పుల భారం మోయాల్సి వస్తుందని, తద్వారా ఆయా నిరుపేద కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతాయని స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ నిర్మాణం ప్రారంభించిన తర్వాత నిర్మాణ వ్యయం పెరిగితే ప్రభుత్వం ఆ భారాన్ని కూడా నిరుపేదల నుంచే వసూలు చేస్తుందా? అని అనుమానిస్తున్నారు. వీటికితోడు రూ.10వేల ఈఎండీ టోకెన్, దరఖాస్తుకు రూ.100 అదనంగా వసూలు చేయనున్నారు. పేదలకు లబ్ధి చేకూర్చే సంకల్పం ఉంటే ప్రభుత్వం ఇన్ని కొర్రీలు ఎందుకు పెడుతుందని మండిపడుతున్నారు.
కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలోని నిరుపేదలకు ఉచితంగా లక్ష డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. లబ్ధిదారులపై రూపాయి భారం పడకుండా ప్రభుత్వమే ఇండ్లు నిర్మించింది. అర్హులను గుర్తించి, ఉచితంగా ఇచ్చింది. నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్.. ఈ పథకంపై దుష్ప్రచారం చేసింది. అవినీతి ఆరోపణలు మోపింది. తీరా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాన్నే పక్కన పెట్టింది. అప్పటికే నిర్మించిన ఇండ్లలో కొన్ని పేదలకు ఇవ్వగా, మరికొన్ని ప్రభుత్వ చర్యలతో గూడుకోల్పోయిన కుటుంబాలకు కే టాయించింది. హైదరాబాద్ పరిధిలో లక్ష ఇండ్లు కట్టిస్తామని రెండున్నరేండ్లుగా ఊదరగొట్టి.. చివరికి ఖర్చులో కేవలం 40% వాటా ఇస్తామని, మిగతా మొత్తం లబ్ధిదారులే భరించాలని కండీషన్ పెడుతున్నది.