హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ) : కరువుభత్యం(డీఏ) కథ మొదటికొచ్చింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సర్కార్ బాకీపడ్డ పెండింగ్ డీఏల సంఖ్య ఆరుకు చేరనున్నది. ఈ ఏడాది జూలై 1న ఇవ్వాల్సిన డీఏను కలుపుకొంటే మొత్తంగా ఆరు డీఏలు సర్కార్ బాకీ పడింది. ప్రభుత్వం విధిగా ప్రతి ఆరు నెలలకోసారీ డీఏ ఇవ్వాలి. కానీ డీఏల విషయంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా చేతులెత్తేసింది. తెలంగాణ, ఏపీ రాష్ట్ర చరిత్రలో ఆరు డీఏలు పెండింగ్‌లో ఉండటం ఇదే తొలిసారి. పైగా ఇన్ని డీఏలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ పెండింగ్‌లో లేవు. ఆఖరుకు దివాలా.. పేదరికంతో బాధపడుతున్న రాష్ర్టాల్లోనూ ఒకటి రెండుకు మించి డీఏలు పెండింగ్‌లో లేవు. అత్యధిక డీఏల పెండింగ్‌తో తెలంగాణ రికార్డుకెక్కిందని ఉద్యోగ సంఘాల నేతలు వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తున్నారు.
జూలై 1న ఇవ్వాల్సిన డీఏకు ఒక రోజు మాత్రమే గడువు ఉన్నది. డీఏ ఇవ్వాలంటే క్యాబినెట్ ఆమోదం తెలుపాలి. ఆ తర్వాత సర్కార్ జీవో జారీచేయాలి. ఇప్పట్లో ఇవేవీ జరిగే పరిస్థితి కనిపించడంలేదు. కనుక పెండింగ్ డీఏల లిస్టు చాంతాడంత అన్నట్టు ఆరుకు చేరిందని సంఘాల నేతలు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. కరువు భత్యం(డీఏ) ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తగ్గించేందుకు ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం చెల్లించే ఉపశమనం. అధిక ధరలు, ధరల సూచీ ప్రకారం ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకూ ఒకటి చొప్పున విధిగా డీఏను విడుదల చేయాలి. కేంద్రం ప్రతి ఆరు నెలలకూ టంచన్‌గా డీఏలు మంజూరుచేస్తున్నది. అనేక రాష్ర్టా లు ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాయి.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మూడు డీఏలు మాత్రమే ఇచ్చింది. ఆరు డీఏలు పెండింగ్‌లో పెట్టింది. కాంగ్రెస్ పాలనను చూస్తుంటే ఆరు నెలలకు డీఏ కాకుండా.. ఏడాదికో డీఏ అన్నట్టుగా పరిస్థితి ఉన్నది. ఈ రెండున్నరేండ్లలో మూడు డీఏలను మాత్రమే ఇవ్వడాన్ని బట్టి చూస్తుంటే ఇదే నిజమనిపిస్తున్నది. ఇచ్చిన మూడు డీఏ బకాయిలను సమాన వాయిదాల్లో చెల్లిస్తామని చెప్పింది. 2.5లక్షలకు పైగా సీపీఎస్ ఉద్యోగులకు డీఏ ఏరియర్స్ రూపాయి కూడా చెల్లించలేదు. ఒక్క రెగ్యులర్ ఉద్యోగులకు మాత్రమే అంతో ఇంతో జమవుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం బాకీపడ్డ ఆరు పెండింగ్ డీఏల మొత్తం 15శాతం ఉంటుందని ఉద్యోగ సంఘాల నేతలంటున్నారు. ఒకశాతం డీఏ ఇస్తే ఏడాదికి రూ. 400 -500కోట్లు అవుతుంది. 15శాతం డీఏ, డీఏ బకాయిలు కలిపితే మొత్తం రూ. 10వేల కోట్లు దాటుతాయని అంటున్నారు. ప్రతి నెలా జీతం ఇస్తున్నామన్న నెపంతో సర్కార్ డీఏలు, పెండింగ్ బిల్లులు, పీఆర్సీ వంటి వాటి నుంచి తప్పించుకోజూస్తున్నదని మండిపడుతున్నారు. కీలక డిమాండ్లు ముందుపెట్టిన ప్రతిసారీ ఒకటో తేదీ జీతం అంశాన్ని తెరపైకి తెచ్చి ఆత్మరక్షణలో పడేస్తున్నదని వాపోతున్నారు. ఉద్యోగులు ఇంతగా నష్టపోతున్నా ఉద్యోగ సంఘాల నేతలు సైతం కిమ్మనడంలేదని పలువురు ఫైర్ అవుతున్నారు.
