Revanth Reddy | స్పెషల్ టాస్క్ బ్యూరో హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ఇంతకాలం గట్టి మద్దతుదారులుగా నిలిచిన హార్డ్‌కోర్ సన్నిహితులు, సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీకి దూరమవుతున్నారు. తమతో సన్నిహితంగా మెలుగుతూనే నెత్తిన భస్మాసుర హస్తం పెట్టాడని రగిలిపోతున్నారు. ‘టికెట్ మీకే పక్కా..’ అంటూ ఇంతకాలం నమ్మబలికి తీరా సమయానికి హ్యాండ్ ఇచ్చాడని సన్నిహితులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ టికెట్లు అమ్ముకుంటున్నారని ఇప్పటివరకు ఆయన వ్యతిరేకవర్గీయులు ఆరోపించగా, తాజాగా ఆయన సన్నిహితులే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు.
ఈ పరిణామం అధిష్ఠానం పెద్దలకు కూడా చికాకుగా మారిందని ఆ పార్టీ వర్గాల సమాచారం. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకాన్ని పార్టీ సీనియర్లు ఆదిలోనే తీవ్రంగా వ్యతిరేకించారు. అయినప్పటికీ పలువురు నేతలు రూ.కోట్లు ఖర్చు పెట్టి రేవంత్‌రెడ్డికి అండగా నిలిచారు. కనీసం ఆ విశ్వాసమైనా లేకుండా రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తుండటంతో బాధతోనే పార్టీని వీడుతున్నట్టు పలువురు నేతలు వాపోతున్నారు. పార్టీకి కీలకమైన ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డి వ్యవహార శైలిపై అధిష్ఠానం పెద్దలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం.
ఎల్బీనగర్ నేతల పరిస్థితి అదే
ఎల్బీనగర్ నియోజకవర్గానికి చెందిన సన్నిహితులు కూడా ఉప్పల్ నాయకులకు ఎదురైన చేదు అనుభవాలనే చవి చూస్తున్నారు. రేవంత్ సన్నిహితుడిగా ముద్రపడిన సీనియర్ నాయకుడు మల్రెడ్డి రాంరెడ్డి ఎల్బీనగర్ టికెట్ ఆశిస్తున్నారు. సరూర్‌నగర్ స్టేడియంలో ప్రియాంకాగాంధీ పాల్గొన్న సభకు అన్నీ తానై కోట్లు ఖర్చు చేశారు. తీరా మాజీ ఎంపీ మధుయాష్కీ ఇక్కడి నుంచి టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడం పార్టీలో కలవరం సృష్టించింది. మల్రెడ్డి రాంరెడ్డితోపాటు పార్టీని కాపాడుకోవడానికి అష్టకష్టాలు పడిన నాయకులను పక్కనపెట్టి మధుయాష్కీ పట్ల రేవంత్‌రెడ్డి మొగ్గు చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పుడు మధుయాష్కీని కూడా కాదని ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన ముద్దగోని రామ్మోహన్‌కు టికెట్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నాడని ఎల్బీనగర్ నాయకులు మండిపడుతున్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో డాక్టర్ రాబిన్రెడ్డి కూడా రేవంత్‌రెడ్డికి సన్నిహితుడు. ఆయనకు టికెట్ ఇప్పిస్తానని ఆశ పెట్టారు. అయితే పీజేఆర్ కూతురు విజయారెడ్డి పార్టీలో చేరగానే రాబిన్రెడ్డిని పక్కన పెట్టారు. దీంతో ఆయన పార్టీకి దూరమయ్యారు. సనత్‌నగర్ నుంచి మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి మనుమడు టికెట్ ఆశిస్తుండగా తాజాగా కోటా నీలిమ తెరపైకి రావడంతో పార్టీలో అలజడి మొదలైంది.
జూబ్లీహిల్స్‌లో మాజీ ఎమ్మెల్యే పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్‌రెడ్డికి పోటీగా మాజీ ఎంపీ అజహరుద్దీన్‌ను ఎగదువ్వుతున్నారు. శేరిలింగంపల్లిలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అనుచరుడు రఘునందన్యాదవ్కు రేవంత్‌రెడ్డి మద్దతు ఇస్తుండటంతో స్థానిక నాయకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మల్కాజిగిరిలో నందికంటి శ్రీధర్‌ను పక్కనపెట్టి మైనంపల్లి హనుమంతరావుకు టికెట్ ఇప్పించడంలోనూ రేవంత్‌రెడ్డి ప్రమేయం ఉండటంతో ఆయన కూడా పార్టీకి దూరమయ్యారు.
ఉప్పల్‌లో సన్నిహితులకు హ్యాండ్
గత అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌లో ఓడిపోయిన రేవంత్‌రెడ్డి ఆ వెంటనే వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పోటీ చేశారు. ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు ఆయన కోసం ఎంతో కృషి చేశారు. ముఖ్యంగా రాగిడి లక్ష్మారెడ్డి, ఏఎస్‌రావునగర్ కార్పొరేటర్ శిరీష భర్త సోమశేఖర్‌రెడ్డి అండగా నిలిచారు. వ్యక్తిగతంగా రూ.కోట్లు ఖర్చు పెట్టారన్నది బహిరంగ రహస్యం. ఒక నాయకుడు అయితే పార్టీలో రేవంత్ నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు, ఆయన కాన్వాయ్ భారీగా ఉండటం కోసం అత్యంత ఖరీదైన 10 ఫార్చూనర్ల్లు కొనుగోలు చేసి ఇచ్చినట్టు పార్టీ వర్గాల సమాచారం. అయితే టికెట్ల ఖరారు కసరత్తులో తనకు కష్టకాలంలో అండగా నిలిచినవారిని పక్కనపెట్టి పార్టీతో సంబంధం లేని, ప్రజల్లో పలుకుబడి లేనివారిని తెరపైకి తెచ్చి డబ్బుకే ప్రాధాన్యం ఇచ్చారని సన్నిహితులు ఆవేదన చెందుతున్నారు.