ఆళ్లపల్లి, ఆగస్టు 21 : మాజీ ఉప సర్పంచ్, కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఎంపీవో, పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకున్నది. మర్కోడు మాజీ ఉప సర్పంచ్ కమల చేసిన రోడ్డు పనులకు పర్సంటేజీగా ఎంపీవో బత్తుల శ్రీనివాస్, మర్కోడు పంచాయతీ కార్యదర్శి తాటి నాగరాజు లంచం డిమాండ్ చేశారు. దీంతో ఆమె ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి సూచన మేరకు ఎంపీవో, పంచాయతీ కార్యదర్శికి స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం రూ.15 వేలు లంచం ఇస్తుండగా.. అప్పటికే మాటువేసిన ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా వారిని పట్టుకుని అరెస్ట్ చేశారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రాజశేఖర్, మల్లేశ్, రాజు, ఆళ్లపల్లి ఎస్సై సతీశ్ పాల్గొన్నారు.
కమలాపూర్, ఆగస్టు 21: యూరి యా బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతుందంటూ రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రైతుల పేరిట యూరియా బస్తాలను పీఏసీఎస్ అధికారి ఫర్టిలైజర్ వ్యాపారులకు అమ్ముతుండగా అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మర్రిపెల్లిగూడెంలో బుధవారం చోటుచేసుకున్నది. పీఏసీఎస్ గోడౌన్ అధికారులు బయోమెట్రిక్‌తోపాటు రైతు ఆధార్‌కార్డు నంబర్ నమోదు చేసుకుని యూరియా బస్తాలు అమ్మకాలు చేయాలి. కానీ నిబంధనలు పాటించకుండా మర్రిపెల్లిగూడెం గోడౌన్ అధికారి రైతుల పేరుతో ఫర్టిలైజర్ వ్యాపారులకు విక్రయిస్తున్నట్టు తెలిసింది. ఆటో ట్రాలీలో యూరియా బస్తాలు గ్రామంలోని ఫర్టిలైజర్ షాపు వద్దకు రావడంతో రైతులు బుధవారం అధికారులకు ఫిర్యాదు చేశారు. ఏవో లక్ష్మారెడ్డి, పీఏసీఎస్ నోడల్ అధికారి దేవేందర్‌రెడ్డి విచారణ జరిపారు. షాపు యజమానికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తానని తెలిపారు. పట్టుబడిన యూరియాను తిరిగి గోడౌన్‌కు తరలించామని చెప్పారు. పీఏసీఎస్ నోడల్ అధికారి దేవేందర్‌రెడ్డిని కదిలించగా.. ఏవోనే చర్యలు తీసుకుంటారంటూ దాటవేశారు.