ఎల్కతుర్తి, సెప్టెంబర్ 20: ప్రభుత్వం కేటాయించిన సీఎంఆర్ ధాన్యంలో రైస్‌మిల్లుల యజమానులు భారీగా అవినీతికి పాల్పడ్డారు. కోట్లాది రూపాయల విలువ చేసే ధాన్యాన్ని ప్రైవేట్‌కు అమ్ముకున్నట్టు తేలింది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్పేటలోని శ్రీ బాలాజీ ఇండస్ట్రీస్ రైస్‌మిల్లుపై శుక్రవారం పొద్దుపోయిన తర్వాత సివిల్ సప్లయీస్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు.
మిల్లులో నిల్వ ఉన్న సీఎంఆర్‌ను లెక్కించగా భారీ ఎత్తున బస్తాలు మాయమైనట్టు తేలింది. ఈ సందర్భంగా సివిల్ సప్లయీస్ ఎన్ఫోర్స్మెంట్ ప్రత్యేకాధికారి ఎల్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. బాలాజీ మిల్లుకు 2021-22, 2022-23 సంవత్సరాలకు మొత్తంగా 6,339 టన్నుల ధాన్యాన్ని సీఎంఆర్‌కు కేటాయించగా, దీనికిగాను 4,310 టన్నుల బియ్యాన్ని తిరిగి మిల్లు యజమాని ఇవ్వాల్సి ఉండగా, కేవలం 1,889 టన్నుల బియ్యాన్ని మాత్రమే ఇచ్చినట్టు తెలిపారు.
మిగతా 3,521 టన్నుల ధాన్యం మిల్లులో ఉండాల్సి ఉండగా, కేవలం 205 టన్నుల ధాన్యం మాత్రమే నిల్వ ఉన్నట్టు గుర్తించినట్టు చెప్పారు. మిగతా ధాన్యం మిల్లు యజమాని ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకు న్నట్టు తేలిందని అన్నారు. కనపడని ధాన్యం విలువ సుమారు రూ.7.50 కోట్లు ఉంటుందని చెప్పారు. ధాన్యం లేనిపక్షంలో డబ్బు చెల్లించేందుకైనా ప్రభుత్వం అవకాశం కల్పించిందని అన్నారు. అయినప్పటికీ మిల్లుల యజమానులు స్పందించకపోవడంతో తనిఖీలు చేపట్టినట్టు ఆయన పేర్కొన్నారు. మిల్లు యజమాని రవీందర్‌రెడ్డిపై క్రిమినల్ కేసులకు సిఫారసు చేయనున్నట్టు తెలిపారు.