హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై సొంత జిల్లా నేతలు తిరుగుబాటు చేశారు. ఆర్మూర్, బాలొండ, బోధన్ నియోజకవర్గాలకు చెందిన నేతలు, కార్యకర్తలు బుధవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోకి దూసుకెళ్లారు. ఆర్మూర్‌కు చెందిన వినయ్‌కుమార్‌రెడ్డి, బాల్కొండకు చెందిన రాజేశ్వర్‌రెడ్డి, బోధన్‌కు చెందిన శ్యాంసుందర్ నేతృత్వంలో పదుల సంఖ్యలో నేతలు, కార్యకర్తలు కార్యాలయంలోకి చొచ్చుకెళ్లి మీడియా హాల్లో బైఠాయించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆ సమయంలో అక్కడే ఉన్నా ఆయన్ను పట్టించుకోకుండా ‘అర్వింద్ డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. నిజామాబాద్ జిల్లాలోని 13 మండలాలకు ఈ నెల 24న కొత్త అధ్యక్షులను ప్రకటించడమే ఈ ఆందోళనకు కారణం. నియమాకాల్లో అన్యాయం జరిగిందంటూ నేతలు, కార్యకర్తలు మండిపడ్డారు.
అర్వింద్ కనుసన్నల్లో ఏకపక్షంగా నియమాకాలు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కనపెట్టిన వారిని తిరిగి నియమించాలని డిమాండ్ చేశారు. వారు మీడియాతో మాట్లాడుతుండడం చూసి పార్టీ కార్యదర్శి ప్రకాశ్‌రెడ్డి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధ్యక్షుడితో చెప్పకుండా మీడియాతో ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించడంతో కార్యకర్తలు ఆయనపైనా తిరగబడ్డారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కార్యకర్తలను బయటకు వెళ్లిపోవాలని ఆదేశించిన పార్టీ కార్యాలయ కార్యదర్శి ఉమాశంకర్పైనా కార్యకర్తలు తిరగబడ్డారు. ఆ తర్వాత కాసేపటికి కిషన్‌రెడ్డి వారిని పిలిపించుకుని మాట్లాడారు. కేంద్రమంత్రి అమిత్‌షా సభ ఉన్న సమయంలో ఇది సరికాదని, పది రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో కార్యకర్తలు, నేతలు వెనుదిరిగారు. ఈ వివాదంపై స్పందించిన ధర్మపురి అర్వింద్ మండలాధ్యక్షుల నియామకాలతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని ప్రకటన విడుదల చేశారు. జిల్లా అధ్యక్షుడు బస్వపురం లక్ష్మీనరసయ్య నిర్ణయం మేరకే మండలాధ్యక్షుల నియామకాలు జరిగాయని పేర్కొన్నారు.