హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): కేంద్ర ఎన్నికల సంఘం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సర్’ ప్రక్రియ రాష్ట్రంలో ఎన్యుమరేషన్ ఫారాల(ఈఎఫ్)పంపిణీలో దూకుడు ప్రదర్శిస్తుండగా, వాటి డిజిటలైజేషన్ మాత్రం నత్తనడకన సాగుతున్నది. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా, అందులో 3,38,18,717 మందికి (99.98 శాతం) ఫారాల పంపిణీ పూర్తయింది. వీటి డిజిటలైజేషన్లో మాత్రం యంత్రాంగం వెనుకబడింది. ఇప్పటివరకు కేవలం 1,44,70,788(42.78 శాతం) ఫారాలు డిజిటలైజ్ అయ్యాయి. ఈ మేరకు సోమవారం సాయంత్రం 6 గంటల వరకు ‘సర్’ ప్రక్రియకు సంబంధించిన అధికారిక గణాంకాలను ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) కార్యాలయం విడుదల చేసింది.
జిల్లా వారీగా పరిశీలిస్తే డిజిటలైజేషన్ ప్రక్రియలో గ్రామీణ జిల్లాలు ముందంజలో ఉంటే, అత్యధిక ఓటర్లు కలిగిన పట్టణ జిల్లాలు వెనుకబడ్డాయి. యాదాద్రి భువనగిరి జిల్లా 75.44% డిజిటలైజేషన్తో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత నల్లగొండ(67.52%), కుమ్రం భీం ఆసిఫాబాద్ (65.94%), సిద్దిపేట (64.86%), నిజామాబాద్ (64.23%) జిల్లాలు ఉత్తమ ప్రదర్శన కనబరిచాయి. రాష్ట్ర రాజధాని పరిధిలోని జిల్లాలు డిజిటలైజేషన్లో దారుణమైన పనితీరును నమోదుచేశాయి.
మేడ్చల్ మలాజిగిరి జిల్లా కేవలం 13.71 శాతం డిజిటలైజేషన్లో చివరి స్థానంలో నిలువగా, హైదరాబాద్(17.22%), రంగారెడ్డి(28.11%) జిల్లాలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. పెద్ద జిల్లాలైన హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మలాజిగిరిలో ఓటర్ల సంఖ్య భారీగా ఉండటం, డాటా ఎంట్రీ వేగం మందగించడమే రాష్ట్ర సగటు పడిపోవడానికి ప్రధాన కారణమని సీఈవో కార్యాలయం చెప్తున్నది. ఈ నెల 24న ఈఎఫ్ స్వీకరణ గడువు ముగియనున్న నేపథ్యంలో డిజిటలైజేషన్ వేగాన్ని మరింతగా పెంచేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపింది.
