అది రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని దుర్గం చెరువు ప్రాంతం.. చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో అక్రమ కట్టడాలను గుర్తించిన రెవెన్యూ అధికారులు దాదాపు 200కు పైగా నోటీసులు జారీ చేశారు. మాదాపూర్‌లోని అమర్ కో-ఆపరేటివ్ సొసైటీలో ఉంటున్న ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతిరెడ్డితోపాటు కావూరిహిల్స్, నెక్టర్స్కాలనీ, డాక్టర్స్‌కాలనీ, అమర్‌సొసైటీ వాసులకు నెల రోజుల వ్యవధితో నోటీసులు జారీ చేశారు. నెలలోపు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని సదరు నోటీసులో పేర్కొన్నారు.
అది మేడ్చల్ మాల్కాజిగిరి జిల్లా ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లో బోయిన్ చెరువు. 40 ఏండ్ల పైబడి కూలీ పనిచేసుకుంటున్న దాదాపు 120 కుటుంబాలకు బాలానగర్ రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఉన్నదని, ఏడు రోజుల వ్యవధితో ఆక్రమణలను కూల్చివేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు.
HYDRA | హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ ): ఈ రెండు ఉదంతాలను పరిశీలిస్తే, హైడ్రా పేరుతో ప్రభుత్వం ఎలా ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నదో అర్థమవుతుంది. కొన్ని రోజులుగా హైడ్రా రోజుకో రీతిలో స్వరం మారుస్తూ, ఆక్రమణల కూల్చివేతల్లో ద్వంద్వ విధానాలను ఆమలు చేస్తున్నది. సామాన్య ప్రజల నుంచి బడా నేతలు, సెలబ్రేటీలకు చెందిన అక్రమ కట్టడాల కూల్చివేతలో తన, మన అనే తేడా లేకుండా ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి. కానీ, పేదోళ్ల గూడుపైనే అత్యధికంగా బుల్డోజర్ల దాడులు జరుగుతున్నాయి. ఆక్రమణలపై నోటీసుల జారీలోనూ ద్వంద్వ విధానాలు ఆమలు చేస్తున్నది. పేదోళ్లకు ఏడు రోజులు, పెద్దలకు 30 రోజులు సమయం ఇస్తూ వ్యత్యాసం చూపుతున్నది. ఇందుకు బోయిన్పల్లి బోయిన్‌చెరువు, దుర్గంచెరువు పరిధిలో ఉన్న నోటీసులు అందుకున్న వారే సాక్ష్యం.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణే ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రా.. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదనే విమర్శలను ఎదుర్కొంటున్నది. ఇప్పటికే నందగిరిహిల్స్ లే అవుట్ విషయంలో పేదల బస్తీలపై ప్రతాపం చూపడంతో కాంగ్రెస్ పార్టీ పంచన చేరిన స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై సీఎంకు ఫిర్యాదు చేశారు. ఇటీవల శేరిలింగంపల్లి మండలంలోని రాయదుర్గం 1 నుంచి 41 వరకు ఉన్న సర్వే నంబర్లలో 37.08 ఎకరాల భూమి విషయంలో జరిపిన కూల్చివేతల్లో ఐదు కుటుంబాలను రోడ్డుపాలు చేశారు. తాజాగా బోయిన్పల్లి డివిజన్లోని పేదలపై ప్రతాపం చూపేందుకు రంగం సిద్ధంచేయడంతో బాధితులు హైడ్రాపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నలభై ఏండ్లుగా ఇక్కడ కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నామని, గడిచిన నాలుగు రోజులుగా రెవెన్యూ విభాగం అధికారులు ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ పరిధి అంటూ నోటీసులు ఇస్తున్నారని స్థానికులు వాపోయారు. 1980 నుంచి ఇండ్లు కట్టుకొని ఉంటున్నామని చెప్తున్నారు.
ఓఆర్ఆర్ పరిధిలోని అన్ని చెరువులు, పార్కులు, నాలాలతోపాటు అన్ని ప్రభుత్వ స్థలాల పరిరక్షణ బాధ్యతలను హైడ్రాకు ప్రభుత్వం అప్పగించింది. అయితే, ఇప్పటివరకు ఆక్రమార్కులకు హైడ్రా నోటీసులు జారీ చేయడం లేదు. నీటిపారుదల శాఖ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెవెన్యూ శాఖలు ఎవరికి వారే అన్నట్టుగా నోటీసులు జారీ చేస్తున్నారు. ఎఫ్టీఎల్, బఫర్‌జోన్, నాలా ఆక్రమణ, వాల్టా చట్టం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆయా శాఖలు వేర్వురుగా నోటీసులు జారీ చేస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారం గందరగోళంగా మారుతున్నది.
దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో తన ఇల్లు ఉన్నదంటూ శేరిలింగంపల్లి రెవిన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి తెలిపారు. 2016-17లో అమర్‌సొసైటీలో నివాసం భవనం కొనుగోలు చేశానని, ఆ సమయంలో ఈ భవనం ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్టు తనకు ఎటువంటి సమాచారం లేదని చెప్పారు. తన ఇల్లు అక్రమంగా ఉంటే కూల్చివేయాలని, అందుకు తనకు కొంత సమయం ఇస్తే ఇంటిలోని ఫర్నీచర్ సహా ఇతర వస్తువులను తీసుకుని బయటకు వెళ్తానని పేర్కొన్నారు. ఈ లే అవుట్‌కు 1995లో అనుమతి ఇచ్చారని, తనపై కొందరు కావాలనే రాజకీయం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.