హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు జరుగుతున్న రెండో సాధారణ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. చివరి రోజైన శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. సాయంత్రం ఐదు గంటల్లోపు కార్యాలయం గేట్ లోపలికి ప్రవేశించిన వారి నుంచి అర్ధరాత్రి వరకు రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరించారు. మొత్తం 123 యూఎల్బీల్లో 2,996 వార్డులకు మూడు రోజుల్లో కలిపి 28,456 నామినేషన్లు దాఖలైనట్టు ఎస్ఈసీ అధికారులు వెల్లడించారు. నామినేషన్ల ప్రక్రియ మొదలైన తొలి రోజు బుధవారం కేవలం 902 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి.
రెండోరోజైన గురువారం వరకు 9,276 నామినేషన్లు, శుక్రవారం వరకు 28,456 నామినేషన్లు దాఖలైనట్టు ఎస్ఈసీ అధికారులు వెల్లడించారు. ఎన్నికలు జరుగుతున్న వార్డుల సంఖ్య వేలల్లో ఉండగా, ప్ర ధాన పట్టణాల్లో పోటీ తీవ్రంగా ఉన్నది. నామినేషన్ల సంఖ్య అభ్యర్థుల సంఖ్య కంటే ఎకువ గా ఉన్నది. ఒకో అభ్యర్థి ఒకటి కంటే ఎకువ సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల పర్వం ముగిసిన వెంటనే స్రుటినీ (పరిశీలన) ప్రక్రియ ప్రారంభం కానున్నది.
ఎస్ఈసీ ఇచ్చిన గణాంకాల ఆధారంగా ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను దాదాపు అన్ని వార్డుల్లో బరిలోకి దింపాయి. రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. వనపర్తి జిల్లాలో 36 నామినేషన్లు, ఆదిలాబాద్, మహబూబ్నగర్ వంటి చోట్ల భారీగా దరఖాస్తులు అందాయి. అధికార పార్టీ కూడా పోటీలో నిలిచింది. పట్టణ ప్రాంతాల్లో బీజేపీ తన ఉనికిని చాటుకుంటూ గణనీయమైన సంఖ్యలో నామినేషన్లు వేసింది. హైదరాబాద్ చుట్టుపకల, కొన్ని పట్టణాల్లో ఎంఐఎం కూడా బలమైన పోటీగా బరిలో నిలిచింది. బీఎస్పీ, సీపీఎం, ఆప్, టీడీపీ కూడా కొన్ని వార్డుల్లో నామినేషన్లు వేశాయి. పార్టీలతో సంబంధం లేకుండా భారీ సంఖ్యలో స్వతంత్ర అభ్యర్థులు పోటీకి సై అంటున్నారు.