కరీంనగర్ కలెక్టరేట్, జూన్ 11 : ఎన్నోఏండ్లుగా కరీంనగర్ జిల్లావాసులు ఎదురుచూస్తున్న నూతన సమీకృత కలెక్టరేట్ భవనం ఎట్టకేలకు పూర్తయింది. బీఆర్ఎస్ పాలనలో.. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి, జిల్లాకో పాలనా సౌధం నిర్మించగా.. ప్రభుత్వం మారడంతో కరీంనగర్లో మాత్రం ఆలస్యమైంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం మేరకు పనులు వేగవంతం చేసినా.. కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వంతో తీవ్ర జాప్యం జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఈ విషయాన్ని సర్కార్ దృష్టికి తీసుకెళ్లగా.. పనుల్లో వేగం మొదలైంది. ఎట్టకేలకు రెండున్నరేండ్ల తర్వాత పూర్తి కాగా, ఈ నెలాఖరున ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నది. నలభైకిపైగా ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోట పనిచేసేలా ఆధునిక హంగులతో నిర్మించిన ఈ భవన సముదాయం అందుబాటులోకి వస్తే ప్రజలకు ఇబ్బందులు తప్పనున్నాయి.
స్వరాష్ట్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 2016లో జిల్లాల పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే అక్టోబర్ 11న కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి, పాలనా సౌలభ్యం కోసం జిల్లాకో సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని నిర్మించిన విషయం తెల్సిందే. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే దాదాపుప అన్ని జిల్లాలకు కొత్త కలెక్టరేట్ భవనాలను నిర్మించినా.. కరీంనగర్లో మాత్రం ఆలస్యమైంది. 2021 డిసెంబర్ 29న అప్పటి బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌తోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో సమీకృత భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. నాడు వేగంగా సాగాయి.
ఏడాదిన్నర వ్యవధిలోనే గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తయింది. అనంతరం అసెంబ్లీ ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో నిధుల విడుదలలో జాప్యం జరిగింది. దీనికితోడు బీఆర్ఎస్ హయాంలో మొదలైన అభివృద్ధి పనులపై నిర్లక్ష్యం కొనసాగింది. దాంతో పనులు నత్తనడకన సాగాయి. వాస్తవానికి 2024 జూన్ నాటికే జీ+2 పద్ధతిన పూర్తి చేసి భవన సముదాయాన్ని వినియోగంలోకి తేవాల్సి ఉన్నా.. నిధుల విడుదలలో జాప్యంతో పనులు మందగించాయి. దీంతో జిల్లా కేంద్రంలో వివిధ ప్రాంతాల్లో చెల్లాచెదురుగా ఉన్న ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న, చిన్న సర్టిఫికెట్ల నుంచి మొదలు రెవెన్యూ, సంక్షేమ, అభివృద్ధి పనుల దాకా ఒక కార్యాలయం నుంచి మరో కార్యాలయానికి తిరగలేక నేటికీ అవస్థలు పడుతూనే ఉన్నారు.
అధికారులు, సిబ్బంది కూడా మౌలిక సదుపాయాల లేమితో ఇక్కట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్ నిర్మాణంలో జరుగుతున్న జాప్యాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. జిల్లావాసులు, అధికారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాగా, పనుల్లో వేగం అందుకున్నాయి. ఫర్నిచర్ ఏర్పాటు మినహా మిగతా ప్రధాన పనులన్నీ పూర్తి కాగా, కలెక్టరేట్ ఆవరణలో చేపట్టిన గ్రీనరీ, ల్యాండ్ స్కేపింగ్ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి.
రిటైనింగ్ వాల్ గ్రిల్లింగ్ పనులు మాత్రమే కొనసాగుతుండగా, అవికూడా మూడు, నాలుగు రోజుల్లో పూర్తి కానున్నాయి. గదుల్లో ఇంటీరియర్‌తోపాటు ఎలక్ట్రిఫికేషన్, వైఫై, ఇతర సౌకర్యాలు కూడా పూర్తయ్యాయి. ఈ నెలాఖరున ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించినా.. అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నూతన కలెక్టరేట్ ప్రారంభం ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడింది. మొదట గ్రౌండ్‌ఫ్లోర్ నిర్మాణం పూర్తికాగానే ప్రారంభించాలనుకున్నా అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఆగిపోయింది.
అనంతరం 2024 ఆగస్టులో ప్రారంభిస్తామని అధికారులు ప్రకటించినా అదీ సాధ్యం కాలేదు. నిరుడు జూన్ 2న ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించినా అది కూడా కార్యరూపం దాల్చలేదు. తాజాగా మంత్రి పొన్నం ప్రకటనతో మరోసారి చర్చ మొదలైంది. ఏదేమైనా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవన సముదాయం పనులు పూర్తికాగా, జిల్లాకు అత్యాధునిక పరిపాలనా కేంద్రం అతి త్వరలోనే అందుబాటులోకి రానున్నది.
కరీంనగర్ సమీకృత కలెక్టరేట్‌ను జీ+2 పద్ధతిలో ఆధునిక హంగులతో నిర్మించారు. రూ.51 కోట్లతో సకల సౌకర్యాలు కల్పించారు. గ్రౌండ్ ఫ్లోర్లో కలెక్టర్, అదనపు కలెక్టర్ గదులు, సందర్శకులు, వ్యక్తిగత సహాయకుల కోసం వేర్వేరుగా గదులు నిర్మించారు. స్టోర్, ఎలక్ట్రికల్, సర్వర్ రూములతోపాటు వీడియో కాన్ఫరెన్స్, మీటింగ్ హాల్, ఫస్ట్ ఫ్లోర్లో 12 ప్రభుత్వ శాఖలతోపాటు స్టేట్ చాంబర్, విజిటింగ్ లాంజ్, కాన్ఫరెన్స్ హాల్, హెచ్‌వోడీ గదులు, సెకండ్ ఫ్లోర్లో 16 ప్రభుత్వ శాఖలకు గదులు, కాన్ఫరెన్స్ హాలు, హెచ్‌వోడీల రూములు అత్యాధునికంగా నిర్మించారు. కలెక్టరేట్ ప్రధాన ద్వారం లోపలి భాగంలో పచ్చని తివాచీలాంటి గడ్డి, తీరొక్క మొక్కలతో సుందరంగా గార్డెన్‌ను తీర్చిదిద్దారు.