హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని నాలుగు మెడికల్ కాలేజీల్లో వెంటనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) ఆదేశించింది. నాగర్ కర్నూల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీతోపాటు అయాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, షాదాన్ ఇన్స్టిట్యూట్, డాక్టర్ వీఆర్కే ఉమెన్స్ మెడికల్ కాలేజీలు ఎన్ఎంసీ నిబంధనలు బేఖాతరు చేస్తున్నట్టు కమిషన్ తాజాగా గుర్తించింది. కాలేజీలో నిర్దేశించిన 25 ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటి లైవ్ ఫీడ్‌ను ఎన్వీఆర్ ద్వారా ఢిల్లీలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధించాలని గతంలో ఇచ్చిన ఆదేశాల అమల్లో కాలేజీల అలసత్వంపై ఎన్ఎంసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆయా రాష్ర్టాల డీఎంఈలకు ఎన్ఎంసీ ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): న్యూ ఢిల్లీలోని భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) తెలంగాణ ప్రాంతీయ కార్యాలయానికి సంబంధించి బుధవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఏపీ ప్రాంతీయ కార్యాలయానికి ట్రాన్స్ఫర్ చేసిన జీఎం(జనరల్) అనూజ్ త్యాగిని తెలంగాణ ప్రాంతీయ కార్యాలయ జీఎంగా నియమించింది. టీజీ జీఎంగా ఉన్న నవీన్కుమార్వర్మను ఢిల్లీ ఎఫ్‌సీఐ కార్యాలయానికి ట్రాన్స్ఫర్ చేశారు.
హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): 18 ఏండ్లలోపు వారికి వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై చర్యలు తీసుకొంటామని రాష్ట్ర రవాణా శాఖ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో మైనర్లకు వాహనాలు ఇచ్చినందుకు రాష్ట్రవ్యాప్తంగా 4,070 వాహన రిజిస్ట్రేషన్లు రద్దు చేసినట్టు అధికారులు చెప్పారు.