హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు, మరణాలపై ఏం చేస్తున్నారని ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిణిని జాతీయ మానవ హక్కుల కమిషన్ నిలదీసింది. ఇప్పటికైనా వివరాలతో కూడిన నివేదికను 4 వారాల్లో ఇవ్వాలని ఆదేశించింది. గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్య, అనుమానాస్పద మృతి, ఫుడ్పాయిజన్ ఘటనలపై నిరుడు ‘నమస్తే తెలంగాణ’లో ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే.
ఆ కథనం ఆధారంగా మంచిర్యాల జిల్లాకు చెందిన సామాజిక కార్యకర్త నయీంపాషా జాతీయ మానవ హకుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఎన్హెచ్ఆర్సీ హైదరాబాద్లోని ఎంసీహెచ్ఆర్డీలో సోమవారం నిర్వహించిన విచారణలో ఆ ఫిర్యాదు ప్రస్తావనకు వచ్చింది. విచారణకు గురుకుల సొసైటీ సెక్రటరీ వర్షిణి హాజరయ్యారు. విద్యార్థుల ఆత్మహత్యలు, ఫుడ్పాయిజన్ పై చర్యలేమిటని కమిషన్ ప్రశ్నించింది.