National Highways | హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం మీదుగా వెళ్తున్న పలు జాతీయ రహదారుల నిర్మాణం నత్తనడకన సాగుతున్నది. జాతీయ రహదారులు ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ) ఈ ఏడాది మార్చిలోగా వీటిని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ కూడా పూర్తి చేయకపోవడంతో పనుల్లో జాప్యం జరుగుతున్నది. దీంతో లక్ష్యాన్ని చేరుకునే అవకాశంలేదని అధికారులు చెప్తున్నారు. ఎన్హెచ్ఏఐ ‘భారత్‌మాలా పరియోజన’ మొదటిదశలో ఇండోర్-హైదరాబాద్ 713కి.మీ, హైదరాబాద్-విశాఖపట్నం మార్గంలో 221కి.మీ, హైదరాబాద్-రాయ్‌పూర్ మార్గంలో 330కి.మీ, నాగపూర్-విజయవాడ మార్గంలో 457కి.మీ మేర ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణం చేపట్టింది.
ఇండోర్-హైదరాబాద్ రోడ్డు నిర్మాణం పూర్తికావడంతో దాన్ని ప్రారంభించారు. హైదరాబాద్- విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌వేలో సూర్యాపేట్ వరకు జాతీయ రహదారి-65ఉండడంతో సూర్యాపేట-దేవరపల్లి ఎక్స్‌ప్రెస్‌వే 221కి.మీ మేర రూ. 4939కోట్ల అంచనా వ్యయంతో నాలుగు లేన్ల రహదారి నిర్మాణం చేపట్టారు. ఈ రహదారి కోసం 31గ్రామాల పరిధిలో 1996ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఈ రహదారి సూర్యాపేట-ఖమ్మం ఎక్స్‌ప్రెస్‌వే(ఎన్‌హెచ్-365బీబీ)తో అనుసంధానమవుతుంది. ఈ రోడ్డు పూర్తయితే ఖమ్మం-విజయవాడ మార్గంలో ట్రాఫిక్ తగ్గుతుంది. దీన్ని ఈ ఏడాది మార్చిలోగా పూర్తిచేయాలని ఎన్హెచ్ఏఐ నిర్ణయించింది. కానీ భూసేకరణ సగం కూడా జరగనందున గడువులోగా రోడ్డు నిర్మాణం పూర్తయ్యే అవకాశంలేదని అధికారులు చెప్తున్నారు.
ఎన్హెచ్ఏఐ నాగ్‌పూర్- విజయవాడ మధ్య 577కి.మీ పొడవైన 4లేన్లు సెమీ యాక్సెస్-కంట్రోల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మిస్తున్నది. ఈ రోడ్డు మహారాష్ట్ర నుంచి తెలంగాణలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం మీదుగా ఏపీలోని కృష్ణా జిల్లాలోకి ప్రవేశిస్తుంది. దీన్ని కూడా ఈ ఏడాది మార్చిలోగా పూర్తిచేయాలని ఎన్హెచ్ఏఐ నిర్ణయించింది. కానీ పెద్దపల్లి నుంచి భూపాలపల్లి, వరంగల్ ప్రాంతాల్లో భూసేకరణ పూర్తి కాలేదు. రాయ్‌పూర్-హైదరాబాద్ ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా హైదరాబాద్ నుంచి రామగుండం, కరీంనగర్ మీదుగా ఆరు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ యాక్సిస్ కంట్రోల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం చేపట్టారు.
ఈ రహదారి మహారాష్ట్రలోని గడ్చిరోలి మీదుగా ఛత్తీస్‌గడ్‌లోని రాజ్‌నంద్‌గావ్, దుర్గ్ నుంచి రాయ్‌పూర్ చేరుతుంది. మన రాష్ట్రంలో ఇది నాలుగు లేన్లుగా ఉండగా ఆరు లేన్లుగా విస్తరించాల్సి ఉంది. ఈ రహదారి మహారాష్ట్రలో 77కి.మీ, ఛత్తీస్‌గడ్‌లో 104కి.మీ, తెలంగాణలో 338కి.మీ ఉంటుంది. కానీ ఈ మార్గానికి భూసేకరణ సమస్యగా మారింది. దీన్ని కూడా ఈ ఏడాది మార్చిలోగా పూర్తిచేయాలని ఎన్హెచ్ఏఐ నిర్ణయించినప్పటికీ భూసేకరణ సమస్య వల్ల పూర్తయ్యే అవకాశంలేదని అధికారులు చెప్తున్నారు. ఇది పూర్తయితే హైదరాబాద్-రాయ్‌పూర్ మధ్య ప్రయాణ సమయం 12గంటల నుంచి 8గంటలకు తగ్గుతుంది.