హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): ‘మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లను పూర్తిగా తెరిచిపెట్టాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) చెప్పింది. బరాజ్‌ల్లో నీటిని నిల్వ చేయకూడదని, ఒకవేళ నిల్వ చేస్తే అవి కూలిపోతాయని ఎన్డీఎస్ఏ స్పష్టంగా తేల్చిచెప్పింది..’ ఇవీ సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పలు సందర్భాల్లో కాళేశ్వరం బరాజ్‌లపై చేసిన వ్యాఖ్యలు. ఆయనే కాదు, ఇతర మంత్రులు, ప్రభుత్వ పెద్దలు కూడా పదే పదే చెప్పిన మాటలివి. ఇదే సాకుగా చూపుతూ బరాజ్‌లను పడావుబెడుతూ వచ్చారు. కానీ, ఇప్పుడు అమాత్యులు మాట మార్చారు. వాస్తవాలను వెల్లడించారు. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు కూలిపోతాయనేది అవాస్తమని తేల్చిచెప్పారు. శాసనమండలి సభ్యులు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
‘మేడిగడ్డ బరాజ్ మాదిరిగా సుందిళ్ల, అన్నారం బరాజ్‌లు కూలిపోతాయని నిపుణులు అభిప్రాయపడిన విషయం వాస్తవమా? కాదా?’ అని శాసనమండలిలో సోమవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎమ్మెల్సీలు కోదండరాం, జీవన్‌రెడ్డి ప్రశ్నించగా.. సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఆ బరాజ్‌లు ‘సేఫ్’ అని తేల్చిచెప్పారు. అదేవిధంగా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటి సరఫరా కోసం ప్రత్యామ్నాయంగా తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మాణం విషయమై పలు ప్రత్యామ్నయ ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఏప్రిల్‌లో సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి మహారాష్ట్ర సీఎంతో పాటు ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులతో సంప్రదింపులు జరపనున్నట్టు వెల్లడించారు.
సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే నిధుల అంచనాలు ఎలా పెరిగాయో లిఖితపూర్వక సమాధానంలో వివరించారు. ప్రాథమిక నివేదికలో 9,000 ఎకరాలు ఉండగా ప్రస్తుతం 18,000 ఎకరాల భూసేకరణ అవసరమైందని పేర్కొన్నారు. పెరిగిన అదనపు భూసేకరణ, విద్యుత్తు సబ్స్టేషన్లు, జీఎస్టీ కలిపి రూ.13,057 కోట్ల నుంచి రూ.19,465 కోట్లకు అంచనాలు పెరిగాయని వెల్లడించారు. సీతారామ ప్రాజెక్టు పురోగతిని తెలిపారు. 114 కిలోమీటర్ల మెయిన్ కెనాల్లో ఇప్పటి వరకు 104 కిలోమీటర్లు పూర్తయినట్టు చెప్పారు.
పాలేరు లింకు కెనాల్ పనులు 32 శాతం పూర్తయ్యాయని, డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్స్కు సంబంధించి 8 ప్యాకేజీలకు బదులుగా 4 ప్యాకేజీ పనులకు టెండర్లు పిలిచామని వివరించారు. మరో 3 ప్యాకేజీలకు ఆమోదం లభిస్తుందని తెలిపారు. రాజీవ్ లింక్ కెనాల్ 18 ఎల్ పూర్తయిందని వెల్లడించారు. రానున్న రెండేండ్లలో ప్రాజెక్టు పూర్తిచేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్టు తెలిపారు.
2024-25 ఖరీఫ్ సీజన్లో 156.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయిందని తెలిపారు. అందులో 53.93 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసినట్టు పేర్కొన్నారు. అందుకోసం రూ.12,511.76 కోట్లు చెల్లించినట్టు ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ తెలిపారు. కాగా, పంట సీజన్ 20 రోజులు పెరగడంతో రాష్ట్రంలో సాగునీటి సమస్య తలెత్తిందని మీడియాతో చిట్‌చాట్‌లో పేర్కొన్నారు.