సూర్యాపేట : కాంగ్రెస్ గుండాల చేతిలో హత్యకు గురైన బీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధు ( BRS Leader Madhu ) ది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యే ( Murder ) నని , మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి( Jagadish Reddy ) ఆరోపించారు. ఈ హత్యలో పోలీసుల భాగస్వామ్యం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. హత్య రాజకీయాలను ప్రోత్సహించడం సరికాదని పేర్కొన్నారు.
శనివారం మధు మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రం సస్యశ్యామలంగా పదేండ్ల పాటు ప్రశాంత వాతావరణాన్ని పెంపొందించామని గుర్తు చేశారు. గతంలో నల్లగొండ కాంగ్రెస్ లోనే అంతర్గత విభేదాలతో వందలాది హత్యలు జరిగాయని, ఎన్నికలోస్తే ఎన్ని హత్యలు జరుగుతాయన్న దారుణమైన పరిస్థితి ఉండేదని వెల్లడించారు.

కేసీఆర్ నాయకత్వంలో శాంతిభద్రతలను పూర్తిగా అదుపులో ఉంచి , పోలీసులు స్వేచ్ఛాయిత వాతావరణంలో పని చేసుకునే వీలు కల్పించామని వివరించారు. కాంగ్రెస్ పాలనలో ఎన్నో అరాచకాలు చూస్తున్నామని, కాంగ్రెస్ గుండాలు, రౌడీల చేతుల్లోనే పోలీస్ స్టేషన్ నడుస్తున్నాయని ఆరోపించారు.బీఆర్ఎస్ నాయకులను స్టేషన్లకు పిలిపించి మరీ కాంగ్రెస్ గుండాల ముందు నిలబెట్టి అవమాన పరుస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆ పార్టీకి తొత్తులుగా పోలీసులు మారడం సిగ్గుచేటని అన్నారు.
గతంలోనూ కాంగ్రెస్ గుండాలు తమ పార్టీ సర్పంచ్ ఒంటెద్దు వెంకన్నను దారుణంగా హత్య చేశారని ఆరోపించారు. ఈ కేసులో ట్రయల్, సాక్షాలు నడుస్తున్న క్రమంలో మధుతోపాటు ఇతర సాక్షులను భయపెట్టే ప్రయత్నం చేశారని వెల్లడించారు. ఈ కేసులో సడన్ గా పీపీని మార్చడం దుర్మార్గమైన చర్య అని అన్నారు.
కేసును బలహీనం చేయడం కోసమే పీపీని మార్చారని, నువ్వు ఎగిరిపోతావని మధుకు స్వయంగా ఎస్సై బెధిరించారని ఆరోపించారు. మధును నమ్మించి తీసుకెళ్లి కిరాతకంగా హత్య చేశారని తెలిపారు. ఈ హత్యకు కాంగ్రెస్ నాయకులు, పోలీసు అధికారులే బాధ్యులని ఆరోపించారు. మధు కుటుంబానికి అండగా నిలబడతామని జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు.ఇద్దరు ఆడపిల్లలకు చదువుల బాధ్యత, కుటుంబ పోషణ విషయంలో బీఆర్ఎస్ బాధ్యత తీసుకుంటుందని వెల్లడించారు.