హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. ఫిబ్రవరిలో రెండో వారంలోగా ఎన్నికలను ముగించాలని నిర్ణయించింది. అదేనెల 14వ తేదీలోగా కొత్త పాలకవర్గాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో పదవీకాలం ముగిసిన 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లలో 2,996 వార్డులు, డివిజన్లలో ఎన్నికలు జరుపాలని నిర్ణయించింది. ఈ మేరకు మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు మంగళవారం లేదా బుధవారాల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నది. ఇదేనెల 26-27 తేదీల్లో నోటిఫికేషన్ విడుదలకానున్నది.
ఆ రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. 29 వరకు నామినేషన్ల స్వీకరణ, 30న పరిశీలన, తిరస్కరణ, 31న అభ్యంతరాల స్వీకరణ, ఫిబవరి ఒకటి అభ్యంతరాల పరిష్కారం, 2న నామినేషన్ ఉపసంహరణ గడువు, ఫిబ్రవరి 3 నుంచి వారంపాటు ప్రచారానికి అవకాశం కల్పించే అవకాశం ఉన్నది. ఫిబ్రవరి 11 లేదా 12 తేదీల్లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఏదో ఒకరోజు ఒకేసారి పోలింగ్ నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలిసింది. ఫిబ్రవరి 14న కొత్త పాలకవర్గాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం.
