హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరికల జోరు కొనసాగుతూనే ఉన్నది. ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వివిధ వర్గాల ప్రజలు పార్టీలో చేరుతున్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అమలవుతున్న పథకాలను చూసి ఆకర్షితులై వెల్లువలా వచ్చి చేరుతున్నారు. మంగళవారం సీఎం కేసీఆర్ సమక్షంలో పలువురు ప్రముఖులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
మహారాష్ట్రకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రమేశ్ పర్సేవార్, ఎన్సీపీ ఉపాధ్యక్షుడు బాలాజీ షెడ్కే, నాందేడ్ ప్రాంత నేతలు రాంశెట్టి, మనోజ్ షారోడ్, పఠాన్, న్యాయవాది శరద్ కాంబ్లే, అశోక్ తదితరులు బీఆర్ఎస్లో చేరారు. రమేశ్ పర్సేవార్కు మహారాష్ట్ర, తెలంగాణతో పాటు ఇతర రాష్ర్టాల్లో వ్యాపారాలు ఉన్నాయి. వారికి సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏ జీవన్ రెడ్డి, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ రవీందర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.