భద్రాచలం, నవంబర్ 12 : ప్రతీక్ జైన్.. ప్రస్తుత వికారాబాద్ కలెక్టర్.. ఒకప్పటి భద్రాచలం ఐటీడీఏ పీవో. ఆయన పీవోగా బాధ్యతలు చేపట్టిందే తడవుగా మన్యం అభివృద్ధికి కంకణం కట్టుకున్నారు. కటిక చీకట్లో మగ్గిపోయిన గూడేలకు విద్యుత్ వెలుగులు ప్రసరింపజేయడం.. విద్యాభివృద్ధికి గురుకుల వ్యవస్థను బలోపేతం చేయడం.. ప్రతి సోమవారం గిరిజన దర్బార్‌లో బాధితుల అర్జీలను త్వరితగతిన పరిష్కరించడం.. ఇలా తన మార్కును చాటుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ సహకారంతో పీవోగా ఎన్నో మంచి పనులు చేసిన ప్రతీక్.. ఇపుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పిదానికి వికారాబాద్ కలెక్టర్‌గా తన పనితీరుపై మాయనిమచ్చ తెచ్చుకోవాల్సి వచ్చింది.
2023, జూలై 15 నుంచి 2024, జూన్ 12 వరకు ప్రతీక్ జైన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడీఏ పీవోగా విధులు నిర్వర్తించారు. 11 నెలల కాలంలోనే గిరిజనుల అభివృద్ధికి ఎనలేని సేవలందించారు. అశ్వారావుపేట మండలం వాగొడ్డుగూడెంతోపాటు సూరంపేట గ్రామాలకు ప్రత్యేక చొరవ చూపి ఐటీడీఏ నిధులు రూ.11 లక్షల వ్యయంతో విద్యుత్ సౌకర్యం కల్పించారు. దీంతో ఆయా గ్రామాల గిరిజనులు ఐటీడీఏకు వచ్చి ప్రతీక్ జైన్‌ను సత్కరించారు. దుమ్ముగూడెం మండలం ఎన్.లక్ష్మీపురం, సింగవరం గ్రామాల గిరిజన రైతుల పంట పొలాల్లో త్రీఫేజ్ విద్యుత్ కోసం ఆ శాఖ అధికారులతో మాట్లాడారు. ఐటీడీఏ నుంచి 117 మంది గిరిజన రైతులకు 11కేవీ విద్యుత్ లైన్ ఇవ్వడంతోపాటు త్రీఫేజ్ సౌకర్యం కల్పించారు.
ఐటీడీఏ పరిధిలోని గిరిజన గ్రామాలన్నింటికీ త్రీఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పించి పీవోగా తమ మార్కును చాటుకున్నారు. ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలను నిరంతరం పర్యవేక్షిస్తూ విద్యార్థులు చదువులో ముందుండేలా వారిని ప్రోత్సహించారు. విద్యార్థుల ఆరోగ్యం కోసం రాగిజావతోపాటు అల్పాహారం కూడా ఏర్పాటు చేయించారు. గిరిజన ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలపై పీవో ప్రతీక్ జైన్‌కు మక్కువ ఎక్కువ.
గిరిజనుల ఆహార అలవాట్లను పాటిస్తూ.. తాను సైతం సొరకాయ బుర్రలో మంచినీటిని తాగిన సందర్భాలున్నాయి. ఐటీడీఏలో ప్రతీ సోమవారం నిర్వహించే గిరిజన దర్బార్ పీవో ప్రతీక్ జైన్ హయాంలోనే గుర్తింపు తెచ్చుకుంది. పీవోకు వివరించిన సమస్యను వెనువెంటనే పరిష్కరించేలా అధికారులకు హుకుం జారీ చేసేవారు. గిరిజన దర్బార్‌కు వచ్చే గిరిజనులకు మజ్జిగ, రాగిజావ స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు.
ప్రతీక్ జైన్ పీవోగా పనిచేసిన కాలంలో గిరిజన గ్రామాల్లో విద్యుత్ వెలుగులు వచ్చాయి. గిరిజనులు కరెంటులేదని పీవోకు పలుమార్లు విన్నవించారు. ఆ సందర్భంగా పీవో పిలిచి కరెంటు సౌకర్యం కల్పించాలి అని చెప్పారు. ఆ దిశగా ఏర్పాట్లు చేసి కరెంటు ఇచ్చాం. ఇలాంటి అధికారిపై దాడి జరగడం బాధాకరం.
– ఎస్డీ.మునీర్ పాషా, ఐటీడీఏ పవర్ ఏఈ, భద్రాచలం
ఐటీడీఏ పీవోగా గిరిజనుల అభివృద్ధికి కృషి చేసి న ప్రతీక్ జైన్.. ఉద్యోగులను కంటికి రెప్పలా కాపాడుకునేవారు. అందరితో కలుపుగోలుగా ఉండే ప్రతీక్‌జైన్‌పై దాడికి దిగడం సరికాదు. ఈ దాడిని టీఎన్జీవోస్ తరఫున ఖండిస్తున్నాం.
-డెక్కా నర్సింహారావు, టీఎన్జీవోస్ అధ్యక్షుడు, భద్రాచలం
భద్రాచలం ఐటీడీఏ పీవోగా వచ్చిన సమయంలో గిరిజనుల అభివృద్ధికి ప్రతీక్ జైన్ విశేష కృషి చేశారు.గిరిజనులు సమస్య అని వస్తే నేరుగా రమ్మనేవారు. ఇలాంటి అధికారిపై దాడులు చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టు.
-పూనెం కృష్ణదొర, ఆదివాసీ నాయకుడు, భద్రాచలం