హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా నిరుడు భారత్కు తిరిగొచ్చిన విద్యార్థుల్లో 3,964 మంది ఇతర దేశాల్లో చదువు కొనసాగిస్తున్నట్టు విదేశాంగ శాఖ తెలిపింది. దాదాపు 20 వేల మంది విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చినట్టు అంచనా. వీరు చదివేందుకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) మూడు రకాల అప్షన్లు ఇచ్చింది. తిరిగి అక్కడే చదువొచ్చని లేదా అకడమిక్ ట్రాన్స్ఫర్, అకడమిక్ మొబిలిటీ ప్రోగ్రాంల కింద ఇతర దేశాలకు వెళ్లాలని సూచించింది. దీంతో 3,964 మంది విద్యార్థులు అకడమిక్ ట్రాన్స్ఫర్ కింద ఇతర దేశాల్లో విద్యాభ్యాసం కొనసాగిస్తున్నట్టు వెల్లడించింది.
మరో 170 మంది విద్యార్థులు అకడమిక్ మొబిలిటీ ప్రోగ్రాం కింద తాత్కాలికంగా విదేశాల్లో చదువుతున్నట్టు తెలిపింది. మిగతా సుమారు 16వేల మంది విద్యార్థుల్లో కొందరు భారత్లోనే ఈ ఏడాది నీట్ రాసి అడ్మిషన్లు పొందగా, మిగతావారు ఉక్రెయిన్ యూనివర్సిటీల్లోనే ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో చదువుతున్నట్టు వివరించింది.