కరీంనగర్ : రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula)కు తృటిలో ప్రమాదం తప్పింది. వేదిక కూలిన(Stage Collapse ) ఘటనలో మంత్రి స్వల్పంగా గాయపడ్డారు. కరీంనగర్ జిల్లా (Karimnagar District) చర్లబూత్కూర్‌లో చిరుతల రామాయణం ప్రదర్శన వేడుకల ముగింపు కార్యక్రమానికి మంత్రి గంగుల హాజరయ్యారు. ఆయన పాటు పలువురు వేదికపైకి ఒక్కసారిగా రావడంతో వేదిక కూలిపోయింది. దీంతో ఆయనతో పాటు సహా నాయకులు, మహిళలు, కళాకారులు కిందపడ్డారు.
ఈ ప్రమాదంలో మంత్రి కాలుకు స్వల్ప గాయమయ్యింది(slightly injured).అనంతరం కరీంనగర్ చేరుకుని దవాఖానాలో పరీక్షలు చేయించుకోగా ప్రాథమిక చికిత్స చేసి పంపించారు. గతంలోనూ తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యుత్ కార్యాలయ ముట్టడి సందర్భంగా మంత్రికి కాలు విరిగింది. ప్రస్తుతం అక్కడే మరోసారి దెబ్బ తగలడంతో మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. వేదికపై ఉన్న వారిలో పలువురికి స్వల్ప గాయాలైనాయి.
విషయం తెలుసుకున్న ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ మంత్రి గంగులను పరామర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు మంత్రి ముగ్ధుంపూర్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.