హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా వేసవి సీజన్లో అధిక వర్షపాతం నమోదైన్నట్టు వాతావరణశాఖ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. కురవాల్సిన మోతాదుకంటే అధికంగా ఈ ఏడాది వేసవిలో వర్షం కురిసిందని తెలిపింది. ఈ మూడునెలల వేసవికాలంలో రాష్ట్రంలో సగటున 55.1 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 166.4 మి.మీ వర్షపాతం నమోదైన్నట్టు వివరించింది. వాతావరణ మార్పుల కారణంగా గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు కనిపించినా.. మొత్తంగా సీజన్ మాత్రం వానలతో గడిచిపోయినట్టు పేర్కొన్నది. మొత్తంగా కురవాల్సిన వర్షపాతం కంటే 206శాతం అధికంగా వర్షాలు కురిశాయని తెలిపింది.
గత నాలుగేండ్ల వేసవిసీజన్లో ఇదే రికార్డు అని పేర్కొన్నది. నిరుడు వేసవిలో 160శాతం వర్షాలు కురిస్తే.. ఈఏడాది దానికి రెట్టింపు కురిసినట్టు వివరించింది. 2022 వేసవి సీజన్లో సగటున 42.2 మి.మీ, 2023లో 60 మి.మీ, 2024లో 80.5 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైన్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది. నిరుడు ఎల్నినో ప్రభావంతో నైరుతి సీజన్లో వర్షపాతం గణాంకాలు ఆశాజనకంగా లేవని గుర్తుచేసింది. ప్రస్తుతం ఈ వర్షకాల సీజన్లో వానలు ఆశాజనకంగా ఉన్నట్టు వెల్లడించింది.
ఈ ఏడాది మార్చి నెలలో సాధారణం కంటే కాస్త తక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ ..ఏప్రిల్ నెలలో మాత్రం అధిక వర్షపాతం నమోదైన్నట్టు వాతావరణశాఖ పేర్కొన్నది. ఇక మేనెలలో 80శాతం అధికంగా వర్షాలు కురిశాయని తెలిపింది. మేనెలలో బంగాళాఖాతంలో అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో వర్షాలు భారీగా నమోదయ్యాయని వెల్లడించింది. మరోవైపు ముందస్తుగా రుతుపవనాల రాకతోనూ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వర్షాలు మోస్తరు నుంచి భారీగా కురిసినట్టు తెలిపింది.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో ఐదురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. గడిచిన 24గంటల్లో ఖమ్మంజిల్లా సింగరేణి మండలంలో 7.21 సెం.మీ, కామేపల్లిలో 4.77, వరంగల్ జిల్లా ఖానాపూర్లో 6.08, సంగెంలో 5.89, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా ఇల్లందులో 4.81, నల్లగొండ జిల్లా నిడమనూర్లో 4.28 సెంటిమీటర్ల వర్షం నమోదైన్నట్టు తెలిపింది. సోమవారం కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్-భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట తదితర జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది.