హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా భానుడి ప్రతాపం మొదలు కానున్నదని హైదరాబాద్ వాతావరణశాఖ అంచనా వేసింది. బుధవారం నుంచి ఎండల ప్రభావం ఉంటుందని, ఈ నెల 17 నుంచి 22 వరకు రాష్ట్రమంతటా బలమైన వేడిగాలులు వీస్తాయని తెలిపింది.
చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 37, 38 డిగ్రీలుగా నమోదై మండే ఎండలు ఉంటాయని హెచ్చరించింది. చలికాలం పూర్తికాకుండానే ఇప్పటికే వేడిగాలులు వీస్తుండటంతో జనం జంకుతున్నారు. ఎందరో అనారోగ్యాల బారిన పడుతున్నారు. హైదరాబాద్లో 36, 37 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఉండనున్నట్టు వాతావరణ శాఖ పేర్కొన్నది.