Mid Day Meal | హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): కొత్త విద్యాసంవత్సరం నుంచి బడుల్లో మెనూ మారనున్నది. మధ్యాహ్న పథకంలో భాగంగా విద్యార్థులకు ఇకపై ప్రతిరోజు పప్పు అందించనున్నారు. కొత్తగా కిచిడీని మెనూలో జత చేశారు. ఈ మేరకు గురువారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ దేవసేన ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో మధ్యాహ్న పథకంలో రోజు విడిచి రోజు పప్పును అందించేవారు. పోషకాహారంలో భాగంగా ఇకపై ప్రతిరోజు పప్పును భోజనంలో వడ్డిస్తారు.
సోమవారం కిచిడీ, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, కోడిగుడ్డు, మంగళవారం రైస్, సాంబార్, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, బుధవారం రైస్, ఆకుకూర పప్పు, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, కోడిగుడ్డు, గురువారం వెజిటబుల్ బిర్యానీ, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, శుక్రవారం రైస్, సాంబార్, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, కోడిగుడ్డు, శనివారం రైస్, ఆకుకూర పప్పు, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీతో కొత్త మెనూను సిద్ధం చేశారు. ప్రతిరోజు విద్యార్థులకు ఏదో ఒకరూపంలో పప్పు ఉండేలా మెనూ సిద్ధం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని మొత్తం 28,606 బడుల్లోని 25,26,907 మంది విద్యార్థులు లబ్ధి పొందుతారు.