Kothagudem | హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): తెలుగు రాష్ర్టాలు నిప్పుల కుంపటిగా మారాయి. పలు ప్రాంతాల్లో రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడు ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. జనం బయటకు రావాలంటే జంకుతున్నారు. ఉక్కపోతతో చిన్నారులు, వృద్ధులు, మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో నాలుగు రోజులు ఇదే తీవ్రత కొనసాగనున్నదని వాతావరణశాఖ వెల్లడించింది. మంగళవారం ఏపీలోని రాజమండ్రి, గుంటూరు జిల్లాల్లో రికార్డుస్థాయిలో 49 డిగ్రీలు, ఏలూరు 48, కొత్తగూడెం, మిర్యాలగూడ, విజయవాడలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీలపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్లగొండ 45, పెద్దపల్లి 45, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో 45 డిగ్రీల సెల్సియస్‌గా, ఆదిలాబాద్‌లో 43, కరీంనగర్లో 42 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావారణశాఖ అధికారులు తెలిపారు.
వడదెబ్బకు ఐదుగురు మృతి
మూడు రోజులుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌లు దాటాయి. వడదెబ్బకు తెలంగాణలో ముగ్గురు, ఏపీలో ఇద్దరు మృతి చెందారు. మరో నాలుగు రోజులుపాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. వృద్ధులు, పిల్లలు బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. వాతావరణ మార్పులతో హెపటైటిస్-బీ ప్రమాదం పొంచి ఉన్నదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
Roads