Harish Rao | హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): దొడ్డు రకాలకు కాకుండా సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని ప్రభుత్వం చెప్పడం రైతులను దగా చేయడమేనని, రైతు నోట్లో మట్టి కొట్టడమేనని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీమంత్రి టీ హరీశ్‌రావు పేర్కొన్నారు. పండని వడ్లకు బోనస్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా రైతులు పండించిన మొత్తం ధాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బోనస్‌పై క్యాబినెట్ సమావేశంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు. మ్యానిఫెస్టోకు విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నారని, ఎన్నికలకు ముందు ఈ విషయాన్ని ప్రకటించి ఉంటే రైతులు కూడా ఎన్నికల్లో తమ నిర్ణయాన్ని చెప్పి ఉండేవారని పేర్కొన్నారు. ఎన్నికలు పూర్తికాగానే సన్నవడ్లకే బోనస్ అని ప్రకటించి రైతులను దగా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
మంగళవారం తెలంగాణ భవన్లో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు దేవీప్రసాద్, అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌లతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో అన్ని రకాల పంటలకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే ఇస్తామని చెప్పడం ఆ పార్టీ మోసానికి పరాకాష్ట అని మండిపడ్డారు.
వానకాలంలో కూడా 20 శాతం మాత్రమే సన్నవడ్లు పండిస్తారని, యాసంగిలో పండేదే దొడ్డువడ్లు అని, పండని సన్నవడ్లకు బోనస్ ఇస్తామనడం మోసం కాదా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో మెజార్టీ రైతులు పండించేది దొడ్డు రకాలేనని చెప్పారు. నిరుద్యోగులకు రూ. 4 వేల భృతి ఇస్తామని హామీ ఇచ్చి, ఆ తర్వాత లేదన్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో సన్నవడ్లకే బోనస్ అని ఎక్కడా చెప్పలేదని, అలా ఉంటే చూపించాలని సవాలు విసిరారు. రేవంత్‌రెడ్డి, భట్టివిక్రమార్క, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ కూడా వరికి బోనస్ అనే చెప్పారని హరీశ్‌రావు గుర్తుచేశారు. వారి మాటల వీడియోను మీడియా ఎదుట ప్రదర్శించారు. వడ్లకు బోనస్ విషయంలో ప్రభుత్వాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని పేర్కొన్నారు. రైతుభరోసా కింద ఎకరాకు రూ. 15 ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని కోరారు. బకాయి పడిన రూ. 2,500, వానకాలం పంటకు ఇచ్చే రూ. 7,500 కలిపి జూన్ లోపల రూ. 10 వేలు రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. సన్నవడ్లతో బోనస్ మొదలు పెడతామని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క చెప్పారని, దొడ్డువడ్లకు ఎప్పటి నుంచి బోనస్ ఇస్తారో చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్ ఎన్నికల హామీ ప్రకారం జొన్న, మిరప, పసుపు, సోయాబీన్, ఎర్రజొన్న ఇతర పంటలకు కూడా ప్రకటించిన ధరలు ఇవ్వాల్సిందేనని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు 36 లక్షల టన్నుల వడ్లు మాత్రమే కొనుగోలు చేసిందని, మరో వారం పదిరోజుల్లో సీజన్ అయిపోతుందని, ఆ లోపు 30 లక్షల టన్నుల ధాన్యం కొనే పరిస్థితి లేదని పేర్కొన్నారు. సన్నబియ్యం వ్యవహారంలో ప్రభుత్వ కొనుగోలు విధానం సరిగా లేదని ఆక్షేపించారు. వడ్ల కొనుగోలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. నాలుగైదు కిలోలు తరుగు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
భూసారం పెంచే జీలుగు, జనుము వంటి పచ్చిరొట్ట విత్తనాలను కూడా ప్రభుత్వం సరఫరా చేయలేకపోతున్నదని, విత్తనాల కోసం కూడా రైతులు క్యూలు కడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. జూన్‌లో రైతుబంధు నిధులు ఇవ్వాలని, వడగండ్లవాన, అకాల వర్షాలతో నష్టపోయిన పంటలకు ఎకరానికి రూ. 25 వేల పరిహారం ఇవ్వాలని, తడిసిన ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్టు చెప్పారు.
మెదక్ జిల్లా హవేలీఘనపూర్ మండలం ముత్తాయికోట గ్రామానికి చెందిన రైతు తడిసిన ధాన్యాన్ని సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని రైస్ మిల్లుకు పంపిస్తే అక్కడ కొనుగోలు చేయడం లేదని మాజీమంత్రి హరీశ్‌రావు తెలిపారు. రైస్‌మిల్లుకు ధాన్యం తీసుకెళ్లిన లారీ డ్రైవర్ ప్రభాకర్‌రెడ్డితో మీడియా సమావేశంలోనే ఆయన ఫోన్లో మాట్లాడారు.
డ్రైవర్: సార్… నేను ఆదివారం అర్ధరాత్రి మెదక్ దగ్గర ముత్తాయికోట నుంచి సోమవారం తెల్లారిగట్ల బెజ్జంకి రైస్ మిల్లుకు ధాన్యం తీసుకొచ్చా సార్.
లేదు సార్. ఇంకా దించుకోలేదు. ఇంతకుముందు మీరు ఫోన్ చేసినంత వరకు ఎవరు చూడలేదు. ఇప్పుడు వచ్చి బొమ్మ వేశారు. ఆ తరువాత ఏం చెప్పలేదు.
అవును సార్ కరెక్టే. ఇంతకు ముందే వచ్చి బొమ్మ కొట్టిపోయారు. మళ్లీ ఎం చెప్పలేదు.
హోటల్లో తింటున్నాను సార్.
సెంటర్ వాళ్లు రూ.500 ఇచ్చారు. మూడు రోజులు ఇక్కడే అయితదని డబ్బులు ఇచ్చారు సార్. ధాన్యం దించుకోకుంటే చెప్పండి.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు 36 లక్షల టన్నుల వడ్లు మాత్రమే కొన్నది. మరో పదిరోజుల్లో సీజన్ అయిపోతుంది. ఆ లోపు 30 లక్షల టన్నుల ధాన్యం కొనే పరిస్థితి ఉన్నదా? వడ్ల కొనుగోలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తేలిపోతున్నది. తడిసిన ధాన్యాన్ని కొంటలేరు. రైతులు రోజులతరబడి కొనుగోలు కేంద్రాల్లో ఎదురుచూడాల్సి వస్తున్నది.
– హరీశ్‌రావు