సిరిసిల్ల నేతన్న చౌరస్తా, డిసెంబర్ 28: ‘మనసన్నదే లేదు ఆ బ్రహ్మకు.. ఎదురీత రాశాడు నా జన్మకు.. రూపంలేని దేవుడు నా రూపాన్ని ఎందుకిలా మలిచాడు’ ఇది రాజేశ్వరి మనోగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సాయినగర్‌కు చెందిన బూర రాజేశ్వరి (42) మాటలు సరిగా రాకపోయినా, చేతులతో రాయలేకపోయినా తన కాళ్లనే చేతులుగా మలుచుకొని అక్షరాలను కవిత్వం రూపంలో ఎక్కుపెట్టింది. బూర అనసూర్య-సాంబయ్య కూతురు రాజేశ్వరి. పుట్టుకతోనే దివ్యాంగురాలైన ఆమె కాళ్లతో ఎన్నో కవితలు రాసింది. ఆమె కవితలు అందరిని విశేషంగా ఆకట్టుకున్నాయి. నడవలేని స్థితిలో కూడా మంచానికే పరిమితమై.. తన భావాలను, మనసులో ఉన్న బాధలను కవితల రూపంలో మలిచింది. 500కుపైగా కవితలు రాసి ఈ లోకాన్ని ఆకర్షించింది.
నాడు వెతుక్కుంటూ వచ్చిన సుద్దాల
ప్రముఖ సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ పాటలంటే తనకు ఇష్టమని ఓ టీవీ ఇంటర్వ్యూలో రాజేశ్వరి చెప్పింది. ఇది విన్న ఆయన రాజేశ్వరిని వెతుక్కుంటూ సిరిసిల్లకు వచ్చి, ఆమె కాలి వేళ్లతో రాసిన కవిత్వాన్ని చూసి ఆశ్చర్యపోయారు. రాజేశ్వరికి ఉజ్వల భవిష్యత్ ఉన్నదంటూ సుద్దాల హన్మంతు-జానకమ్మ రాష్ట్రస్థాయి అవార్డు అందించారు. కవిత్వంలో ఆమె చేస్తున్న ప్రయోగాలు సాహితీవేత్తలను సైతం ఆకట్టుకున్నాయి.
అండగా నిలిచిన ప్రభుత్వం
రాజేశ్వరి ప్రతిభను మెచ్చిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆమె పేరుమీద ప్రభుత్వం తరపున రూ.10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయించారు. ప్రతి నెలా రూ.7 వేల వడ్డీతోపాటు రూ.3 వేల పెన్షన్ వస్తున్నది. రాజేశ్వరి ఉండేందుకు మండెపల్లి కేసీఆర్ కాలనీలో డబుల్బెడ్రూం ఇల్లు కేటాయించారు. ఆమె అక్కడే ఉంటున్నది. మంత్రి కేటీఆర్ అన్నిరకాలుగా అండగా నిలిచినా ఫలితం లేకపోయింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ దవాఖానలో చికిత్స పొందుతున్న ఆమె బుధవారం మధ్యాహ్నం మరణించింది.
రాజేశ్వరి జీవనం ఎంతోమందికి ఆదర్శం: కేటీఆర్
హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): బూర రాజేశ్వరి మృతి పట్ల ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. నిరుపేద చేనేత కుటుంబంలో జన్మించి, వైకల్యాన్ని జయించి ఆత్మవిశ్వాసంతో కాళ్లనే చేతులుగా మలుచుకొని, అక్షరాలు నేర్చుకొని కవితలు రాసిన తీరు అద్భుతమని అన్నారు. శరీరానికే వైలక్యం కానీ, ఆలోచనకు, ఆశయానికి కాదని రాజేశ్వరి తన మనోైస్థెర్యంతో నిరూపించినట్టు మంత్రి పేర్కొన్నారు. ఆమె స్ఫూర్తివంతమైన జీవన ప్రయాణం ఎంతో మందికి ఆదర్శమని అన్నారు. రాజేశ్వరి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.