హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): సింగరేణిలో బొగ్గు స్కాం ఆరోపణలపై యాజమాన్యం స్పందించింది. 40 లక్షల టన్నుల బొగ్గు మిస్సింగ్ అయ్యిందన్న వాదనలపై సంస్థ వివరణ ఇచ్చింది. సింగరేణిలో ప్రస్తుతం 26.51 లక్షల టన్నుల బొగ్గు నిల్వలున్నట్టు సంస్థ అధికారికంగా ప్రకటించింది. 2014 నుంచి 2024 వరకు సగటున 50 లక్షల టన్నుల బొగ్గు నిల్వలుండగా, గతంతో పోల్చితే ఇదే తక్కువ బొగ్గు స్టాక్ అని సంస్థ వివరించింది. 39 గనులున్న సింగరేణిలో ఉత్పత్తి, రవాణా జరుగుతున్న నేపథ్యంలో కొంత మొత్తంలో బొగ్గు నిల్వ ఉండటం అత్యంత సహజమని సంస్థ వెల్లడించింది. నవంబర్ నుంచి మే మాసం వరకు అధిక ఉత్పత్తి కారణంగా బొగ్గు నిల్వలు పేరుకుపోతాయని తెలిపింది.
2015 -16లో 70, 2016-17లో 74 లక్షల టన్నుల బొగ్గు నిల్వ ఉన్నట్టు వెల్లడించింది. థర్మల్ప్లాంట్ల కోసం 15 రోజులకు సరిపడా కనీసం 30 లక్షల టన్నుల బొగ్గు నిల్వలను సిద్ధంగా ఉంచుతామని తెలిపింది. ఓవర్ బర్డెన్ పనులను మధ్యలోనే నిలిపివేయడంతో సైట్ విజిట్ సర్టిఫికెట్ను తప్పనిసరిచేశామని తెలిపింది. అనేక సంస్థలు సైట్ విజిట్ సర్టిఫికెట్ను అమలు పరుస్తున్నాయని సంస్థ ఉదహరించింది. కోలిండియా అనుబంధ సంస్థ అయిన సీఎంపీడీఐ సంస్థ సలహా మేరకు సైట్ విజిట్ సర్టిఫికెట్ తప్పనిసరి చేశామని వెల్లడించింది. గత మెడికల్ బోర్డులపై ఏసీబీ విచారణ జరుగుతున్నదని, ఇద్దరు ఉద్యోగులు అరెస్టు అయ్యారని తెలిపింది. ఇదే వ్యవహారంపై సింగరేణి విజిలెన్స్ విభాగం కూడా విచారణ జరుపుతున్నదని పేర్కొన్నది.