టోక్యో: భారత బ్యాడ్మింటన్ చరిత్రలో రెండు ఒలింపిక్ పతకాలతో పాటు ఆటలో ఎన్నో చిరస్మరణీయ అందించిన తెలుగు తేజం పీవీ సింధు ఖాతాలో మరో చరిత్రాత్మక విజయం. భారత షట్లర్లెవరికీ సాధ్యం కాని జపాన్ ఓపెన్ సూపర్ 750 టైటిల్‌ను ఆమె తొలిసారిగా కైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆదివారం ఉదయం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్స్‌లో సింధు.. 21-17, 21-17తో మూడుసార్లు వరల్డ్ చాంపియన్ అకానె యమగుచి (జపాన్)ను చిత్తుచేసి టైటిల్ దక్కించుకుంది. వరుస గేమ్స్‌లో ప్రత్యర్థికి చుక్కలు చూపిస్తూ 50 నిమిషాల్లోనే ఆటను ముగించిన సింధు.. రెండేండ్ల తర్వాత బీడబ్ల్యూఎఫ్‌లో మేజర్ టైటిల్‌ను సాధించింది.
హోరాహోరీ పోరు
క్వార్టర్స్‌లో ఒకుహర కాలిగాయంతో వెనుదిరగడం, సెమీస్‌లో చైనా షట్లర్ యూఫీ ఒక గేమ్ తర్వాత ఆట నుంచి తప్పుకోవడంతో ఫైనల్ చేరిన సింధుకు టైటిల్ పోరులో కఠిన సవాల్ తప్పలేదు. ఈ టోaర్నీలో ఏకంగా ఆరో ఫైనల్ ఆడుతున్న లోకల్ షట్లర్‌పై సింధుకు గొప్ప రికార్డేమీ లేదు. అయినా ఫైనల్లో మాత్రం ఆమె సత్తాచాటింది. పూర్తి నియంత్రణతో పాటు సంయమనంతో ఆడిన సింధు.. ప్రత్యర్థికి సొంతగడ్డపై ఓటమి రుచి చూపించింది. తొలి గేమ్‌లో ఇరువురూ ఢీ అంటే ఢీ అనడంతో ఇద్దరి స్కోర్లు దాదాపు ఒకేలా సాగాయి. క్రాస్‌కోర్ట్ షాట్‌తో సింధు 8-6 ఆధిక్యంలోకి వెళ్లగా బ్రేక్ తర్వాత ఇద్దరూ ఏకంగా 36 షాట్ల సుదీర్ఘ ర్యాలీతో ఆట మరింత రసవత్తరమైంది. ఆ తర్వాత జపాన్ అమ్మాయి ఒక్కసారిగా పుంజుకుని 17-15తో ఆధిక్యంలోకి వచ్చింది.
కానీ తనలోని వింటేజ్ సింధును గుర్తుచేస్తూ పదునైన స్మాష్‌లతో పాటు తన ట్రేడ్‌మార్క్ షాట్లతో రెచ్చిపోయిన డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్.. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశమివ్వకుండా తొలి గేమ్‌ను ముగించింది. రెండో గేమ్ ఏకపక్షంగా సాగినట్టు అనిపించినా యమగుచి అనూహ్యంగా పుంజుకోవడంతో ఈ గేమ్‌లోనూ ఉత్కంఠ తప్పలేదు. ఈసారి 44 షాట్ల భారీ ర్యాలీతో పాటు వరుసగా ఆరు పాయింట్లు సాధించి 8-3 ఆధిక్యంతో వెళ్లిన సింధు.. ఆ తర్వాత కొద్దిగా తడబాటుకు గురవడంతో ప్రత్యర్థి ఎదురుదాడికి దిగింది. విరామం వరకు 11-7తో ఆధిక్యంలో ఉన్న సింధుకు షాకిస్తూ యమగుచి ఆమె ఆధిక్యాన్ని 14-12కు తగ్గించింది. అదే జోష్‌లో రెండో గేమ్ సైతం 19-17 వద్ద ఉండటంతో మరోసారి ఉత్కంఠ. కానీ సింధు సంయమనం కోల్పోకుండా ఆడి గేమ్‌తో పాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకుని రికార్డు విజయాన్ని నమోదుచేసింది.