‘ఇది కేవలం సినిమా మాత్రమే కాదు. మనదేశం కల. ఆ కలను నిజం చేసేందుకు మేమంతా చేసిన ప్రయత్నమే ‘రామాయణ’ ’ అన్నారు నటుడు, నిర్మాత యశ్. ఆయన రావణుడిగా నటిస్తూ నమిత్ మల్హోత్రాతో కలిసి స్వయంగా నిర్మించిన పానిండియా పౌరాణిక దృశ్యకావ్యం ‘రామాయణ’. రణబీర్‌కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్న ఈ చిత్రానికి నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా, ‘రామాయణ : పార్ట్ 1’ దీపావళి కానుకగా నవంబర్‌లో విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ నెల 24న ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేయనున్నారు.
ఇందులో భాగంగా దేశ రాజధాని దిల్లీలో ప్రథమ్ సంక్పల్ప్ పేరిట ఏర్పాటు చేసిన వేడుకలో నటుడు, నిర్మాత యశ్ మాట్లాడారు. ‘మన సీతారాముల కథను ప్రపంచ వేదికపై నిలబెట్టాలనే సంకల్పంతో చేసిన ప్రయత్నమిది. దేశ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేసే ఓ మహా ప్రయాణానికి శ్రీకారం ఈ ‘రామాయణ” అని దర్శకుడు నితేశ్ తివారి పేర్కొన్నారు. ఈ సినిమాలో భాగం కావడం పట్ల రణ్‌బీర్‌కపూర్, సాయిపల్లవి, రకుల్‌ప్రీత్‌సింగ్, వివేక్ ఒబెరాయ్, సన్నీ దేఒల్, శోభన, అరుణ్‌గోవిల్ సంతోషం వెలిబుచ్చారు. కార్యక్రమంలో భాగంగా ఈ నెల 24న విడుదల కానున్న ట్రైలర్‌ని ఎంపిక చేసిన అతిథులకు ప్రత్యేకంగా ప్రదర్శించారు.