లండన్: తన ఫామ్‌పై విమర్శలకు, రిటైర్మెంట్పై వస్తున్న ఊహాగానాలకు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (110 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్సర్లతో 138) ఒక్క ఇన్నింగ్స్‌తో చెక్ పెట్టాడు. లార్డ్స్ గడ్డపై ఖతర్నాక్ సెంచరీతో కదం తొక్కి తన బ్యాట్ పవర్ తగ్గలేదని నిరూపించాడు. 39 ఏండ్ల రోహిత్ వన్డేల్లో 34వ శతకంతో విజృంభించినా..కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (84 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌తో 77), కింగ్ కోహ్లీ (60 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 74) మెరిసినా పేస్ లీడర్ బుమ్రా లేని బౌలింగ్ బృందం వైఫల్యం భారత్‌ను ముంచింది. ఆదివారం జరిగిన మూడో వన్డేలో భారత్ 27 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓడి 1-2తో సిరీస్ కోల్పోయింది. ఆతిథ్య జట్టు ఇచ్చిన 388 పరుగుల రికార్డు ఛేదనలో ఓవర్లన్నీ ఆడిన టీమిండియా 360/7 స్కోరు మాత్రమే చేయగలిగింది. సామ్ కరన్ (4/75) భారత్‌ను దెబ్బకొట్టాడు. తొలుత . బెన్ డకెట్ (135 బంతుల్లో 18 ఫోర్లు, 1 సిక్స్‌తో 141) భారీ శతకంతో ఆకట్టుకోవడంతో ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 387/3 స్కోరు చేసింది. జాకబ్ బెథెల్ (91), జో రూట్ (74 నాటౌట్), జోస్ బట్లర్ (13 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 41 నాటౌట్) సత్తా చాటారు. బెథెల్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కగా.. రూట్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు.
రో‘హిట్’ కొట్టినా..
రోహిత్ అద్భుత సెంచరీ సహా టాప్-3 బ్యాటర్లు సత్తా చాటినా లక్ష్యం మరీ పెద్దది కావడంతో భారత్ గమ్యాన్ని ముద్దాడలేకపోయింది. కొత్త బంతితో ఆర్చర్, అట్కిన్సన్ కట్టడి చేయడంతో తొలి 5 ఓవర్లలో 17 పరుగులే వచ్చాయి. ఫస్ట్ బౌలింగ్ ఛేంజ్‌గా ఎనిమిదో ఓవర్లో బంతిని అందుకున్న జోష్ టంగ్‌కు రోహిత్ రెండు ఫోర్లు, సిక్స్‌తో స్వాగతం పలికి ఒక్కసారిగా గేర్ మార్చాడు. కరన్ వేసిన 11వ ఓవర్లో రోహిత్ 4,6తో మరింత జోష్ పెంచగా.. కెప్టెన్ శుభ్‌మన్ కూడా క్రమ తప్పకుండా బౌండరీలు కొడుతూ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. మధ్యలో కాస్త నెమ్మదించినా అట్కిన్సన్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన రోహిత్ 50 బంతుల్లో అర్ధ శతకం అందుకున్నాడు. విల్ జాక్స్ ఓవర్లో భారీ సిక్స్ కొట్టిన గిల్ కాలు కండరాలు పట్టేయంతో ఇబ్బంది పడ్డాడు. మూడు ఓవర్ల తర్వాత అతను ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోవడంతో తొలి వికెట్‌కు 147 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. అయినా ఇన్ఫామ్ బ్యాటర్ విరాట్ క్రీజులోకి వచ్చిన తర్వాత ఛేజింగ్‌కు జోష్ వచ్చింది. కోహ్లీ తోడవ్వగానే మరింత ఉత్సాహం తెచ్చుకున్న రోహిత్.. టంగ్ వేసిన 28వ ఓవర్లో రెండు సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు.
రషీద్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి శతకం పూర్తి చేసుకోవడంతో లార్డ్స్ బాల్కనీలోని కోచ్ గంభీర్ సహా భారత జట్టంతా చప్పట్లతో అతడిని అభినందించింది. రోకో ద్వయం వరుస బౌండరీలు కొడుతూ ముందుకెళ్లగా 38 ఓవర్లకు స్కోరు 250 దాటడంతో భారత్ గెలుపు దిశగా సాగింది. కానీ, బెథెల్ వేసిన తర్వాతి ఓవర్లో భారీ సిక్స్ కొట్టిన రోహిత్ మరో షాట్‌కు ప్రయత్నించి క్లీన్ బౌల్డ్ అవ్వడంతో రెండో వికెట్‌కు 113 పార్ట్నర్షిప్ ముగిసింది. చివరి 10 ఓవర్లలో భారత్‌కు 121 రన్స్ అవసరం అవగా.. క్రీజులో కోహ్లీ ఉండటంతో భారత్ ఆశలు కోల్పోలేదు. జాక్స్ వేసిన 42వ ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టిన విరాట్ జట్టులో గెలుపు నమ్మకం పెంచాడు. కానీ, చివర్లో ఇంగ్లిష్ టీమ్ అద్భుతంగా బౌలింగ్ చేసింది. 44వ ఓవర్లో ఇషాన్ (14), వైస్ కెప్టెన్ అయ్యర్ (0)ను పెవిలియన్ చేర్చిన సామ్ కరన్ తన తర్వాతి ఓవర్లోనే కోహ్లీని బ్రూక్ క్యాచ్‌తో వెనక్కిపంపి టీమిండియాను దెబ్బకొట్టాడు. రాహుల్ (12), అక్షర్ (2) నిరాశపరచడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు.
డకెట్ భారీ సెంచరీ
తొలుత ఆతిథ్య బ్యాటర్లు పోటీపడి పరుగుల మోతెక్కించడంతో ఇంగ్లండ్ భారీ స్కోరు చేసింది. మోకాలి గాయం కారణంగా బుమ్రా దూరం అవ్వడంతో బలహీనంగా మారిన భారత బౌలింగ్‌ను ఇంగ్లిష్ టీమ్ ప్లేయర్లంతా ఓ ఆటాడుకున్నారు. ఓపెనర్లు డకెట్, బెథెల్ తొలి వికెట్‌కు 192 రన్స్ జోడించి భారీ స్కోరుకు బాటలు వేశారు. రూట్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ ఈ సిరీస్‌లో వరుసగా మూడో హాఫ్ సెంచరీ సాధించగా చివరోబట్లర్ భారీ షాట్లతో విరుచుకుపడటంతో ఇంగ్లిష్ టీమ్ లార్డ్స్‌లో అత్యధిక స్కోరు సాధించింది.
సంక్షిప్త స్కోర్లు