FIFA World Cup 2026 | ప్రపంచ ఫుట్‌బాల్ మహా సమరంలో స్పెయిన్ మొనగాళ్లే రారాజులుగా నిలిచారు. అద్వితీయ ప్రదర్శనతో ఆకట్టుకున్న స్పానిష్ టీమ్ 16 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత రెండోసారి జగజ్జేతగా అవతరించింది. కోట్లాది మంది అభిమానులు ఉత్కంఠతో ఊపిరి బిగబట్టి చూసిన ఫైనల్ పోరులో స్పెయిన్ జట్టు తిరుగులేని ఆటతో ప్రత్యర్థిని ముంచెత్తింది. మైదానంలో ప్రతి అంగుళాన్ని తమ అద్భుతమైన పాస్‌లతో శాసిస్తూ, భీకర దాడులతో అర్జెంటీనా రక్షణ శ్రేణిని ముక్కలు చేసింది. హోరాహోరీ తప్పదనుకున్న సాకర్ కురుక్షేత్రాన్ని పూర్తిగా ఏకపక్షం చేసింది!
మెస్సీ నాయకత్వంలోని ఫార్వర్డ్స్ పూర్తిగా తేలిపోయిన వేళ నిర్ణీత 90 నిమిషాల పాటు అర్జెంటీనా కీపర్ ఎమిలియానో అడ్డుగా నిలిచినా, ఎక్స్ట్రా టైమ్‌లో సాగిన స్పెయిన్ దండయాత్రను ఆపలేకపోయాడు. 106వ నిమిషంలో ఫెర్రన్ టోరెస్ కొట్టిన బుల్లెట్ లాంటి గోల్‌తో అర్జెంటీనా కోట బద్దలైంది. ఈ చరిత్రాత్మక విజయంతో పురుషుల, మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్ టైటిళ్లను ఒకేసారి కైవసం చేసుకున్న తొలి దేశంగా స్పెయిన్ సాకర్ చరిత్రను తిరగరాసింది. మరో కప్పు నెగ్గి కెరీర్‌ను ఘనంగా ముగించాలని ఆశించిన మెస్సీ కన్నీళ్లతో తన పోరాటం ముగించాడు!!
న్యూయార్క్: క్రీడా ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఫిఫా సాకర్ మహా సంగ్రామంలో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాపై యూరోపియన్ కింగ్ స్పెయిన్‌దే పైచేయి అయింది. మెగా టోర్నీలో స్పానిష్ టీమ్ రెండోసారి విజేతగా నిలిచింది. ఆఖర్లో అద్భుతాలు నమోదు చేస్తూ వరుసగా రెండోసారి ఫైనల్‌కు వచ్చిన అర్జెంటీనాను స్పానిష్ టీమ్ అడ్డుకుంది. మెస్సీ మ్యాజిక్ చేయకుండా నిలువరించింది. అసలు ఆ జట్టుకు గోల్ కొట్టే అవకాశమే రాకుండా చేసి.. చరిత్ర సృష్టించింది. 80 వేల మంది ప్రేక్షకులతో కిక్కిరిసిన మెట్‌లైఫ్ స్టేడియంలో భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి మొదలై తెల్లవారుజాము వరకూ సాగిన ఫైనల్లో స్పానిష్ టీమ్ 1-0తో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాను ఓడించింది. 2010లో తొలిసారి కప్పు నెగ్గిన ఆ జట్టు మళ్లీ ఇన్నేండ్ల తర్వాత రెండో ట్రోఫీని అందుకుంది. ఈ మ్యాచ్‌లో స్పెయిన్ ఎంతలా ఆధిపత్యం చెలాయించిందంటే.. ఒక దశలో స్పెయిన్ 16 షాట్లు కొట్టగా, అర్జెంటీనా కనీసం ఒక్క షాట్ కూడా టార్గెట్ వైపు కొట్టలేకపోయింది. స్పానిష్ టీమ్ టార్గెట్‌పై 11 సహా మొత్తంగా 20 షాట్లు కొడితే అర్జెంటీనా కేవలం రెండే షాట్లు అది కూడా చివర్లో కొట్టగలిగింది.
రెండు మేటి జట్ల మధ్య ఆఖరాట తొలుత చప్పగా సాగింది. ఫస్టాఫ్‌లో స్పెయిన్ జట్టు బంతిపై పూర్తి నియంత్రణ ప్రదర్శించింది. అర్జెంటీనా కంటే రెట్టింపు పాస్‌లు పూర్తి చేస్తూ వరుస దాడులతో ఒత్తిడి పెంచింది. అయితే, మెస్సీసేన డిఫెన్స్ లైన్ అంతే ధీటుగా స్పందించి స్పెయిన్ దాడులను తిప్పికొట్టింది. ఐదో నిమిషంలో స్పెయిన్ యువ సంచలనం లామిన్ యమాల్ రైట్ ఫ్లాంక్లో బంతిని అందుకొని టార్గెట్‌పై దాడి చేసినా.. గోల్ కొట్టలేకపోయాడు. ఆ వెంటనే మెస్సీసేన సైతం కౌంటర్ ఎటాక్ ప్రారంభించింది. ఓ దశలో మెస్సీ బంతిని ప్రత్యర్థి బాక్స్ వద్దకు తీసుకెళ్లినా.. స్పెయిన్ కీపర్ చాకచక్యంగా అడ్డుకున్నాడు.
సెకండాఫ్ మొదలైన వెంటనే స్పెయిన్ పూర్తిగా ఎటాకింగ్ మోడ్‌లోకి వెళ్లింది. బంతిని అర్జెంటీనా బాక్స్‌లోనే ఉంచిన రొడ్రి నేతృత్వంలోని ఆ జట్టు ఫార్వర్డ్స్ వరుస దాడులతో హోరెత్తించారు. కానీ, అర్జెంటీనా గోల్ కీపర్ మార్టినేజ్ అడ్డుగోడల నిలబడటంతో ఆ జట్టు ప్రయత్నాలు ఫలించలేదు. విరామం నుంచి వచ్చిన వెంటనే స్పెయిన్ ఆటగాడు బేనా బాక్స్ వెలుపల నుంచి కొట్టిన ప్రమాదకర షాట్‌తో పాటు 64వ నిమిషంలో ఓల్మో షాట్, 67వ నిమిషంలో యామల్ క్రాస్‌ను టోర్రెస్ హెడర్ ద్వారా గోల్ కొట్టే ప్రయత్నాన్ని కూడా నిలువరించాడు. ఇక, 77వ నిమిషంలో స్పెయిన్ ఒక్కసారిగా దాడుల మోత మోగించింది. పెద్రి, యమామల్, కుబార్సి వేసిన వరుస షాట్లు కొట్టినా అవి మార్టినెజ్ పెట్టని గోడను దాటలేదు. స్పెయిన్ దాడులను నిలువరించడంలో మునిగిన మెస్సీసేన గోల్ కోసం కనీస ప్రయత్నం కూడా చేయలేకపోయింది.

నిర్ణీత సమయంలో టార్గెట్‌పై ఒక్క షాట్ కూడా కొట్టలేకపోయినా అర్జెంటీనాకు ఇంజూరీ టైమ్‌లో షాక్ తగింది. స్పెయిన్ ప్లేయర్ కుబార్సిని ఫౌల్ చేసిన ఎంజో ఫెర్నాండెజ్‌కు రిఫరీ రెండో ఎల్లో కార్డు చూపించాడు. ఫలితంగా అతడు రెడ్ కార్డ్ అందుకుని మైదానాన్ని వీడాడు. దాంతో డిఫెండింగ్ చాంపియన్ పది మందితోనే ఆడాల్సి వచ్చింది. ఈ తరుణంలో ఫెర్రన్ టోర్రెస్‌ను పారడెస్ ఫౌల్ చేయడంతో స్పెయిన్‌కు డీ బాక్స్ వెలుపల ఫ్రీ కిక్ రూపంలో మరో అద్భుత అవకాశం లభించింది. దీనికి స్పానిష్ వండర్ కిడ్ యమాల్ గోల్ పోస్ట్‌కు కుడి అంచువైపు కొట్టినా..అర్జెంటీనా కీపర్ మార్టినెజ్ ఊహించని రీతిలో డైవ్ చేసి బంతిని ఆపాడు. ఇరు జట్లు నిర్ణీత సమయంలో గోల్ చేయకపోవడంతో విజేత ఎవరో తేలడానికి మ్యాచ్ ఎక్స్ట్రా టైమ్‌కు చేరింది.
ఎక్స్ట్రా టైమ్ మొదలైన వెంటనే స్పెయిన్ ఆటగాడు నికో విలియమ్స్ (96వ నిమిషంలో) బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపి సంబరాల్లో మునిగిపోయాడు. అయితే, గోల్ ప్రయత్నంలో స్పానిష్ ప్లేయర్ మైకెల్ మెరినో.. అర్జెంటీనా డిఫెండర్ నికోలస్ ఒటామెండి కాలిని తొక్కి ఫౌల్ చేసినట్టు గుర్తించిన రిఫరీ ఆ గోల్‌ను నిరాకరిచడంతో స్పెయిన్ ఆటగాళ్లు నిరుత్సాహపడ్డారు. కానీ, ఎక్స్ట్రా టైమ్‌లో బ్రేక్ నుంచి వచ్చిన వెంటనే స్పెయిన్ సంచలన గోల్ సాధించి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 106వ నిమిషంలో నికో విలియమ్స్ ఎడమ వైపు నుంచి అర్జెంటీనా డిఫెన్స్‌ను చేధిస్తూ ఒక అద్భుతమైన క్రాస్ అందించాడు. దీన్ని అందుకున్న ఫెర్రన్ టోరెస్ ఏమాత్రం తడబడకుండా అర్జెంటీనా కీపర్ మార్టినెజ్, ముగ్గురు డిఫెండర్లను ఛేదిస్తూ బంతిని నెట్లోకి పంపాడు. దీంతో స్పెయిన్ 1-0తో ముందంజ వేసింది. కాసేపటికే టోరెస్ మరోసారి బంతిని నెట్లోకి పంపినా.. రిఫరీ దాన్ని ఆఫ్‌సైడ్‌గా తేల్చాడు. మరో 20 నిమిషాల ఆటలో స్కోరు సమం చేయలేకపోయిన అర్జెంటీనాకు ఓటమి తప్పలేదు.
టోర్నీ ఆసాంతం రాణించిన ఎంబాపెనే గోల్డెన్ బూట్ (అత్యధిక గోల్స్ చేసినవారికి ఇచ్చే అవార్డు) వరించింది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అతడు రెండుగోల్స్ చేయడంతో టోర్నీలో అతడి గోల్స్ సంఖ్య 10కు చేరింది. ఫైనల్లో మెస్సీ మ్యాజిక్‌తో ఎంబాపెకు చెక్ పెడతాడని భావించినా అదేమీ లేకపోవడంతో ఫ్రాన్స్ సారథి వరుసగా రెండోసారి ఈ అవార్డును ఎగురేసుకుపోయాడు. 10 గోల్స్‌తో పాటు ఎంబాపె 4 అసిస్ట్‌లు కూడా చేయగా మెస్సీ.. 8 గోల్స్ (4 అసిస్ట్‌లు)తో రెండో స్థానంతో టోర్నీని ముగించాడు. ఇక టోర్నీ చరిత్రలో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాడిగానూ ఎంబాపె (22) రికార్డు పుటల్లోకి ప్రవేశించాడు. ఒక టోర్నీలో హయ్యస్ట్ గోల్స్ చేసినవారిలో ఎంబాపె (10).. తన దేశానికే చెందిన జస్ట్ ఫొంటెన్ (1958లో 13), హంగేరి ఆటగాడు సాండొర్ కొక్సిస్ (1954లో 11) తర్వాతి స్థానాల్లో నిలిచాడు.