సిటీబ్యూరో, జూలై 19 (నమస్తే తెలంగాణ) : మాన్సూన్ పనులపై హైడ్రా పర్యవేక్షణ ఎంత అధ్వానంగా ఉందో చెప్పడానికి బడంగ్‌పేట మున్సిపల్ సర్కిల్ జిల్లెలగూడలో కనిపించిన దృశ్యాలే నిదర్శనం..అత్యవసర సమయాల్లో రోడ్లపై ఉండాల్సిన మాన్సూన్ రక్షణ వాహనాలు, సిబ్బంది ఏకంగా కల్లు దుకాణాల ముందు దర్శనమిస్తున్నాయి. అంతేకాదు అత్యంత ప్రమాదకరమైన విధుల్లో నిబంధనలకు విరుద్ధ్దంగా మహిళా కార్మికులను రాత్రి వేళల్లో వాహనాల్లో తిప్పుతూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మూడు షిప్టులకు డ్రైవర్‌తో సహా ఇతర సిబ్బంది వేర్వేరుగా ఉండాల్సిన చోట ఒక షిప్టుతోనే శ్రమ దోపిడీకి పాల్పడున్నారు.
నిబంధనల ప్రకారం ప్రతి వార్డులో మూడు షిప్టుల్లో కలిపి 12 మంది సిబ్బంది ఉండాలి.. కానీ కేవలం నలుగురితోనే మమ అనిపిస్తున్నారు. మిగిలిన ఎనిమిది మంది జీతాలను దారి మళ్లించి ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న సంబంధిత ఏజెన్సీలపై చర్యలు తీసుకోకపోవడం హైడ్రా అధికారుల పనితీరుపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు సంవత్సరాల ప్రగతిపై ఆర్భాటపు ప్రచారాలు చేసుకుంటున్న హైడ్రా..అసలు విధులను విస్మరించి ఏజెన్సీల దోపిడీకి అడ్డాగా మార్చిన వైనం చర్చనీయాంశంగా మారింది. గతంలో మాన్సూన్ పనులను జీహెచ్ఎంసీ పర్యవేక్షించిందని, కానీ హైడ్రాకు అప్పగించడంతో అవినీతి కోరలు చాచిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల అవగాహన రాహిత్యం, పర్యవేక్షణ లోపం కాంట్రాక్టర్లకు కాసుల వర్షంగా మారడం గమనార్హం.

కల్లు దుకాణం వద్ద మాన్సూన్ వాహనాలు, సిబ్బంది
జీహెచ్ఎంసీ పరిధిలోని బడంగ్‌పేట మున్సిపల్ సర్కిల్ జిల్లెలగూడలో మాన్సూన్ పనుల తీరు హైడ్రా పర్యవేక్షణకు అద్దం పడుతున్నది. ఈ ప్రాంతంలో ఏకంగా మాన్సూన్ వాహనం ఫీల్డ్‌లో కాకుండా కల్లు దుకాణాల వద్ద దర్శనమిస్తున్నాయి. మాన్సూన్ పనుల్లో చాలా వరకు స్కిల్ లేబర్‌ను నియమిస్తారు. కానీ ఇక్కడ మాత్రం రిస్క్ పనులు అని తెలిసిన కూడా మహిళలను ఈ బృందాలలో పనులు చేయిస్తున్నారు. బహిరంగంగానే మాన్సూన్ వాహనంలో మహిళలను తీసుకువెళ్లడం, రాత్రి వేళల్లో మద్యం దుకాణాల వద్ద వాహనం నిలిపివేయడం, సమస్యలు ఉన్నచోట ఉండాల్సిన వాహనం కల్లు దుకాణాల వద్ద దర్శనమివ్వడం, సంబంధిత వాహనాల్లో మైనర్లు ఉండడం, మాన్సూన్ పనితీరు, హైడ్రా పర్యవేక్షణకు అద్దం పడుతున్నది. నిబంధనలు పాటిస్తున్నారా… లేదా అనే పర్యవేక్షణ లేకపోవడం గమనార్హం.
ఉప్పల్‌లో మారని తీరు…
ఉప్పల్ సర్కిల్ పరిధిలోని 6 డివిజన్లు ఉన్నాయి. ఇక్కడ సుమారు కోటి రూపాయల వరకు టెండర్‌ను దక్కించుకున్నారు. 72 మంది సిబ్బందికి గాను పట్టుమని పాతిక మంది కూడా క్షేత్రస్థాయిలో పనిచేయడంలేదు. మూడు షిప్టుల్లో 24 గంటల పాటు నలుగురు సిబ్బందితోనే డ్రైవర్ కూడా పనిచేయాల్సి వస్తుంది. వరద నియంత్రణ చర్యల్లో భాగంగా నిద్ర లేకుండా సిబ్బంది పనిచేస్తే వారికి అపాయం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారో తెలియదు. వాహనం డ్రైవర్ 24 గంటల పాటు సేవలు అందించడం సాధ్యమేనా… అనేది హైడ్రా గుర్తించకపోవడం గమనార్హం. క్షేత్రస్థాయిలో తిరుగాల్సిన వాహనాలు, సిబ్బంది నివాసం ఉండే చోటే తిష్టవేసి ఉంటున్నాయి. అన్ని తెలిసినా హైడ్రా మానంగా ఉంటుంది. ప్రైవేట్ వ్యక్తులు సూపర్వైజర్లుగా ఉంటారు.. హైడ్రా మార్షల్స్ మాత్రం కనిపించరు. గతంలో కూడా తూతూ మంత్రంగానే పనులు జరగడంతో ఉప్పల్ సర్కిల్ ప్రాంతాలలో చాలప్రాంతాలు నీటమునిగాయి. రోజుల తరబడి కాలనీలు నీటిలోనే మునిగాయి. మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు… అనే తీరులో వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
హైడ్రా మౌనం…
టెండర్ నుంచి పనులు పూర్తిచేసేవరకు హైడ్రా అధికారుల పర్యవేక్షణ లోపించింది. క్షేత్రస్థాయిలో భారీగా నిబంధనలు తుంగలో తొక్కుతున్న, విషయం తెలిసిన అధికారులు మౌనం పాటిస్తున్నారు. విషయం తెలిసిన మౌనం పాటించడం, చర్యలు తీసుకోకపోవడంపై హైడ్రాపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్యూర్ పరిధిలోని 60 సర్కిల్స్‌లోను మూడు షిప్టులలో ప్రతి వార్డుకు 12 మంది పనిచేయాల్సి ఉండగా, నలుగురితోనే మమ అనిపిస్తున్నారు. అంటే ఇక్కడ మూడోవంతు దోపిడీ జరుగుతున్నదని స్పష్టమవుతున్నది. పూడికలు తీయాల్సిన సిబ్బంది, జియో మ్యాపింగ్ ఫొటోలకే పరిమితమవుతున్నారు. ప్రతి సర్కిల్లో 4 నుంచి 6 వార్డులు ఉన్నాయి. అంటే ప్రతి సర్కిల్‌కు సుమారుగా రూ. 95 లక్షల నుంచి రూ.1.40 కోట్ల వరకు టెండర్లు దక్కించుకున్నారు. సుమారుగా ప్రతి సర్కిల్‌కు కోటి రూపాయల నిధులు కేటాయించారు. కానీ ఇందులో కాంట్రాక్టర్ల దోపిడీ ఎంత అనేది సిబ్బంది సంఖ్య, వాహనాలు, పనిచేసేవారికి వారు ఇచ్చే వేతనాలు, నిపుణులైన కార్మికులు(స్కిల్వర్కర్స్)ను నియమించకుండా పనులు చేస్తున్నారు. అన్ని తెలిసినా హైడ్రా మౌనం వహించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జీహెచ్ఎంసీ నిఘా మేలు..
గత రెండు సంవత్సరాలుగా మాన్సూన్ పనులను హైడ్రా నిర్వహిస్తున్నది. గతంలో మున్సిపాలిటీ అధికారులు పర్యవేక్షణలో పనులు చేసేవారు. ఇంజినీరింగ్ విభాగం ఇంజినీర్లకు వరద నియంత్రణ, కాలువులు, వరదనీటి నిల్వ ప్రాంతాలు వారికి అవగాహన ఉంటుంది. వర్క్ ఇన్స్పెక్టర్లు క్షేత్రస్థాయిలో నిత్యం అందుబాటులో ఉంటూ, ఏ ప్రాంతం నుంచి వరదను ఎలా తొలగించవచ్చనే అవగాహన ఉంటుంది. అవినీతికి అస్కారం లేకుండా, నిత్య పర్యవేక్షణ ఉండేది, ఈఈ, డీసీ, జడ్సీ, కమిషనర్ల ఉన్నతస్థాయి పర్యవేక్షణ ఉండేది.
కాంట్రాక్టర్లు, సిబ్బందిలో భయం ఉండేది. దీనితో పనుల్లో కొంతమేర పారదర్శకత కనిపించేంది. కానీ హైడ్రాకు పనులు అప్పగించడం, వీరు కొంతమందిని సూపర్‌వైజర్లగా నియమించి, హైడ్రా అధికారులు ఎక్కడ క్షేత్రస్థాయిలో పర్యటించకపోవడంతో కాంట్రాక్టర్లు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో కాంట్రాక్టర్లకు మాన్సూన్ పనులు కాసులు కురిపిస్తున్నది. పోటీలు పడి మరీ లెస్‌లు వేసి, టెండర్లు దక్కించుకున్నారు. ఒక్కొక్కరికీ మూడు ఆరు ప్రాంతాల్లో పనులు దక్కాయి. ఇందులో సగం మంది సబ్ లీజులకు ఇచ్చి దండుకుంటున్న పరిస్థితి. దీంతో ఈ మాన్సూన్ పనులకు క్రేజీ ఏర్పడింది.
నెల రోజులు కావస్తున్నా..
మాన్సూన్ పనులు ప్రారంభించి, దాదాపు నెలరోజులు కావస్తున్నది. క్షేత్రస్థాయిలో భారీగా నిబంధనలు తుంగలో తొక్కినట్లు ‘నమస్తే తెలంగాణ’ ఆధారాలతో కథనాలు ప్రచురించింది. 60 సర్కిల్స్‌లలో ఇప్పటివరకు హైడ్రా కమిషనర్ ఎక్కడ పర్యటించినట్లు హైడ్రా అధికారులు ప్రచారం చేయలేదు. క్షేత్రస్థాయిలో సిబ్బంది నిబంధనల ప్రకారంలేరని తెలుసు. పనుల్లో పారదర్శకత లోపించినట్లు కనిపిస్తున్నది. ఈ సీజన్లో వర్షాలు రాకపోవడంతో సమస్యలు ఇప్పటివరకు ఉత్పన్నం కాలేదు. వర్షాలు, వరదలు రాకముందే, క్షేత్రస్థాయిలో కమిషనర్ పర్యటించి, నిబంధనల ఉల్లంఘన చేస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.