ఆదిలాబాద్ జిల్లా మత్తడి ప్రాజెక్టు కాల్వల నిర్వహణ అధ్వానంగా మారింది. ఈ ప్రాజెక్టు ఎడమ కాల్వ కింద 8,500 ఎకరాల ఆయకట్టు ఉంది. కాల్వల్లో చెత్తాచెదారం, ఎండిన మొక్కలు పేరుకుపోవడంతో ఆయకట్టుకు నీరు అందడం లేదు. కాల్వలకు మరమ్మతులు చేసి నీటిని అందించాలని రైతులు కోరుతున్నారు.
రైతులకు సాగు కష్టాలు తప్పడం లేదు. ఉమ్మడి పాలమూరు జిల్లా మహ్మదాబాద్ మండలంలో 5,500 ఎకరాల్లో వరి సాగు చేయగా.. నీటి తడులు అందక 140 ఎక రాల్లో వరి పొలాలు బీటలువారాయి. కంచన్‌పల్లికి చెందిన రైతు రాంపురం శ్రీనివాస్ పొలంలోని బోర్లలో నీటిమట్టం తగ్గడంతో దాదాపు రెండెకరాల్లో పంట ఎండింది. మిగతాది కూడా తడారి ఎండు దశకు చేరింది.
టమాటకు మార్కెట్లో ధర లేకపోవడంతో రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం గంగన్నగూడకు చెందిన రైతు టీ ప్రవీణ్‌రెడ్డి తీవ్రంగా నష్టపోయాడు. ఎకరాకు రూ.25 వేల చొప్పున మూడెకరాల్లో పంట సాగు చేశాడు. గురువారం 100 బాక్సులను మహబూబ్‌నగర్ మార్కెట్‌కు తరలించగా, దళారులు రూ.3 కిలో చొప్పున అడగడంతో తీవ్ర అసహనానికి గురయ్యాడు. తీసుకెళ్లిన వాహనానికి డీజిల్‌కు సరిపడా డబ్బులు కూడా రావని గ్రహించి వాహనాన్ని వెనక్కి తీసుకొచ్చాడు. దారిలో ఫతేపూర్ మైసమ్మ వద్ద రోడ్డు పక్కన పారబోసి దున్నపోతులకు ఆహారంగా పెట్టాడు.