హైదరాబాద్, అక్టోబర్ 31(నమస్తే తెలంగాణ): ఖమ్మం కాంగ్రెస్‌లో ముఖ్య నేతలు నాలుగు వర్గాలుగా విడిపోయి కుంపట్లు పెట్టుకున్నారు. ఎవరికి వారు తమ ఆధిపత్యాన్ని చాటుకునేందుకు తహతహలాడుతున్నారు. తెరవెనుక కుట్రలకూ తెరలేపారనే చర్చ మొదలైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కీలక నేతలైన భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, రేణుకా చౌదరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్నది.
ఈ నలుగురూ ఒకరికి వ్యతిరేకంగా మరొకరు కుట్రల రాజకీయానికి తెరతీసినట్టు గుసగుసలు. మిగతా నేతలు ఓడితేనే తన ప్రాబల్యం పెరుగుతుందని భావిస్తున్న వారు కుట్రలు చేస్తున్నట్టు జిల్లా కాంగ్రెస్‌లోనే చర్చ నడుస్తున్నది. ఇతరుల నియోజకవర్గాల్లోని కింది స్థాయి నేతలకు ప్రలోభాల వల వేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ‘ఇప్పటికైతే ఆయన కోసమే పనిచేస్తున్నట్టు నటించు.. కానీ అంతర్గతంగా ఆయన ఓటమికి చేయాల్సింది చేయ్’ అంటూ పొరుగు వర్గంలోని తన వారికి సూచనలు ఇస్తున్నట్టు తెలిసింది.
అన్నిచోట్లా వర్గం-వైరం
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో వర్గం-వైరం కొనసాగుతున్నది. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పోటీ చేసే పాలేరు నియోజకవర్గంలో అసంతృప్త నేతలైన రాయల నాగేశ్వరరావు, మద్ది శ్రీనివాస్‌రెడ్డి భట్టి, రేణుకా వర్గ నేతలుగా చెప్పుకుంటున్నారు. ఖమ్మంలో అసంతృప్త నేతలైన డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మానుకొండ రాధాకిషోర్ కూడా భట్టి, రేణుకా వర్గంగా చెప్తారు. దుర్గాప్రసాద్‌ను భట్టి పట్టుబట్టి మరీ ఖమ్మం డీసీసీ అధ్యక్షుడిగా చేసినట్టు ప్రచారముంది. వైరాలో పొంగులేటి వర్గంగా విజయబాబుకు పేరుండగా రాందాస్, రామ్మూర్తినాయక్కు రేణుక, భట్టి వర్గాలుగా పేరు పడింది.
వీరి ద్వారా ఆయా నియోజకవర్గాల్లో తోటి అభ్యర్థులను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. భట్టి విక్రమార్క కమ్యునిస్టులతో పొత్తుకు ఆసక్తి చూపుతుండగా, మిగతా ముగ్గురు నేతలు పొత్తుకు విముఖతతో ఉన్నారని తెలిసింది. పైకి ఒకరికొకరు కలిసికట్టుగా పనిచేస్తున్నట్టు కనిపిస్తున్నా లోలోపల మాత్రం వైరం కొనసాగుతుండటంతో పార్టీకి నష్టం జరుగుతుందనే ఆందోళన పార్టీ అధిష్టానంలో నెలకొన్నదని తెలిసింది.